భారత నూతన ఎన్నికల కమిషనర్ ఎవరంటే? ఎంత కాలం పదవిలో ఉంటారంటే?

Update: 2022-05-12 13:30 GMT
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా మరొకరు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 15న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సీఈసీగా వ్యవహరిస్తున్న సుశీల్ చంద్ర పదవీ కాలం ముగియనున్న వేళ.. ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు రాజీవ్ కుమార్ ను ఎంపిక చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా.. ఉన్న వారిలో సీనియర్ ను ఎంపిక చేయటం సంప్రదాయంగా వస్తోంది.

సుశీల్ చంద్ర పదవీ కాలం తర్వాత ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో సీనియర్ గా ఉన్నది రాజీవ్ కుమార్. దీంతో.. ఆయనకు ఆ పదవిని కేటాయిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ కు చెందిన ఆయన.. ఏడాది పాటు ఈ పదవిలో ఉండనున్నారు. అనంతరం ఆయన రిటైర్ కానున్నారు.

ప్రస్తుతం సీఈసీగా వ్యవహరిస్తున్న సుశీల్ చంద్ర పదవీ కాలం మే 14తో ముగియనుంది. మే 15న రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతల్ని చేపట్టనున్నారు. కర్ణాటక.. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయన హయాంలో జరగనున్నాయి. ఒకవేళ అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి షెడ్యూల్ కు కాస్త ముందుగా ఎన్నికలకు వెళ్లిన పక్షంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే పూర్తి అయ్యే అవకాశం ఉంది.

రాజ్యాంగంలోని క్లాజ్ (2).. ఆర్టికల్ 324 మేర రాజీవ్ కుమార్ ఎంపిక జరిగిందని కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజోజు వెల్లడించారు. పలు బోర్డులు.. కమిటీల్లో పని చేసిన అనుభవం రాజీవ్ కుమార్ సొంతం. రాజీవ్ కుమార్ విషయానికి వస్తే.. ఆయన 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు. జార్ఖండ్ క్యాడర్ కు చెందిన ఆయన గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉంది. 2020 ఏప్రిల్ లో పబ్లిక్ ఎంటర్ ప్రైజస్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2020 సెప్టెంబరు ఒకటిన ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్ గా చేరారు. ఏడాదిన్న వ్యవధిలోనే ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ స్థాయికి చేరుకున్నారు.

రాజీవ్ కుమార్ గతంలో నిర్వహించిన కీలక బాధ్యతల్ని చూస్తే..

- పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఛైర్మన్
-  ఆర్బీఐ డైరెక్టర్
-  ఎస్ బీఐ..నాబార్డు లోనూ కీలక బాధ్యతలు
- ఎకనామిక్ ఇంటలిజెన్స్ కౌన్సిల్ సభ్యుడు
-  ఎఫ్ఎస్ఢీసీ సభ్యులు
-  బ్యాంకు బోర్డు బ్యూరో సభ్యుడు
-  ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులరేటరీ అప్పాయింట్ మెంట్స్ సెర్చ్ కమిటీ సభ్యుడు
Tags:    

Similar News