9 రాష్ట్రాలకు కొత్త సీజేలు.. దేశవ్యాప్తంగా 14మంది బదిలీ

Update: 2020-12-17 04:05 GMT
దేశ న్యాయవ్యవస్థలోనే ఒక భారీ మార్పు చోటుచేసుకుంది. ఎప్పుడూ లేనంతగా భారీగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు చోటుచేసుకున్నాయి.  ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించడం సంచలనంగా మారింది.  మొత్తంగా 14మంది న్యాయమూర్తులు బదిలీ కావడం చర్చనీయాంశమైంది.

ఏపీలోని హైకోర్టు న్యాయమూర్తులపై సీఎం జగన్ చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం.. తెలంగాణ సర్కార్ ను అక్కడి హైకోర్టు తీర్పులు ఇబ్బందుల్లోకి నెట్టుతున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల సీజేలు మారడం చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పుకు ముందు కేసీఆర్, జగన్ లు ఢిల్లీ పెద్దలతో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశవ్యాప్తంగా చూస్తుంటే  ఐదుగురు న్యాయమూర్తులు సీజేగా పదోన్నతి లభించింది. నలుగురు చీఫ్ జస్టిస్ లు బదిలీపై వస్తుండగా.. మరికొందరు హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు.

ఏపీ హైకోర్టు సీజే మహేశ్వరి హిమాలయ సానువుల్లోని చిన్న రాష్ట్రం సిక్కింకు బదిలీ కావడం గమనార్హం.  తెలంగాణ సీజే రాఘవేంద్రసింగ్ ఉత్తరాఖండ్ కు బదిలీ అయ్యారు. ఒడిషా సీజే మధ్యప్రదేశ్ కు.. సిక్కిం సీజే గోస్వామి ఏపీకి బదిలీ అయ్యారు.

*చీఫ్ జస్టిస్ లుగా పదోన్నతి పొందిన వారు..
ఇక హైకోర్టుల్లో పనిచేస్తున్న జస్టిస్ లు పలువురు సీజేలుగా పదోన్నతి పొందారు. ఢిల్లీ జస్టిస్ హిమా కోహ్లి తెలంగాణకు బదిలీ అయ్యారు. ఉత్త‌రాఖండ్ హైకోర్టులో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ సుధాంశు ధులియా ప‌దోన్న‌తిపై గౌహ‌తికి బ‌దిలీ అయ్యారు.కోల్‌క‌త్తాలో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ సంజీబ్ బెన‌ర్జీ మ‌ద్రాస్‌కు బ‌దిలీ అయ్యారు. అల‌హాబాద్‌లో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ పంక‌జ్ మిత్ర‌ల్ జ‌మ్మూక‌శ్మ‌ర్‌కు బ‌దిలీ అయ్యారు. పంజాబ్ లో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ ఎస్‌. ముర‌ళీధర్ హ‌ర్యానాకు బ‌దిలీ అయ్యారు.

* బ‌దిలీ అయిన న్యాయ‌మూర్తులు..
 మ‌ద్రాస్ హైకోర్టులో ప‌ని చేస్తున్న జ‌స్టిస్‌జ‌స్టిస్ వినీత్ కొఠారి గుజ‌రాత్‌కు బ‌దిలీ అయ్యారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టులో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ సంజ‌య్ యాద్ అల‌హాబాద్‌కు బ‌దిలీ అయ్యారు. అక్కడి హైకోర్టులోనే పని చేస్తున్న జ‌స్టిస్ స‌తీష్ చంద్ర‌శ‌ర్మ క‌ర్ణాట‌క‌కు బ‌దిలీ అయ్యారు.కోల్ క‌త్తా హైకోర్టులో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ బోయ్‌మాల్య బాగ్చి ఏపీకి బ‌దిలీపై అయ్యారు. జ‌మ్మూలో హైకోర్టులో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ రాజేష్ బిందాల్ కోల్‌క‌త్తాకు బ‌దిలీ అయ్యారు.

*తెలంగాణ సీజే జస్టిస్ హిమా నేపథ్యం..
తెలంగాణ హైకోర్టుకు సీజే జస్టిస్‌ హిమా కోహ్లి బదిలీ అయ్యారు. ఈమె 1959 సెప్టెంబర్‌ 2న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీలోని సెయింట్‌ థామస్‌ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి బీఏ గ్రాడుయేట్‌ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చరిత్రలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేశారు. 1984లో లా పట్టా అందుకుని ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో నమోదయ్యారు. 1999 నుంచి 2004 వరకు ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌కు స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, న్యాయ సలహాదారుగా పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 ఆగస్టు 29న పూర్తికాలం న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Tags:    

Similar News