విన్నారా.. మోడీ అస్సలు రాజకీయాల్లోకి రావాలనుకోలేదట!

Update: 2019-11-24 14:30 GMT
తను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు  ప్రధానమంత్రి నరేంద్రమోడీ! దేశ చరిత్రలో అత్యంత భారీ మెజారిటీతో ప్రధాని గా రెండు సార్లు పదవీ బాధ్యతలు చేపట్టిన అరుదైన నేతగా మోడీ నిలుస్తూ ఉన్నారు. వ్యతిరేకించే వాళ్లు వ్యతిరేకించవచ్చు గాక.. గత కొన్ని దశాబ్దాల్లో ఎవరూ సంపాదించుకోలేనంత మెజారిటీ మోడీ సొంతం చేసుకుని ప్రధాని అయ్యారు. దేశంలో మోడీ మానియా ఇంకా ఉంది.

అదెన్నాళ్లు ఉంటుందో ఎవరూ చెప్పలేరు. మోడీ మరో టర్మ్ ప్రధాని అవుతారా? అనే అంశం పై కూడా చర్చ ఉండనే ఉంది. అది ఇప్పుడప్పుడే తేలే అంశం కాదు. ఏదేమైనా గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశానికి రెండు సార్లు రికార్డు స్థాయి మెజారిటీలతో ప్రధాని కావడం ద్వారా మోడీ అనితర సాధ్యుడు అయ్యారు!

అయితే.. అలాంటి వ్యక్తి తను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని చెప్పడం గమనార్హం. చిన్నప్పుడు తను ఎన్నడూ ఇలాంటి ఊహలు కూడా పెట్టుకోలేదని మోడీ  చెప్పుకొచ్చారు. తన జీవితంలో బాల్యంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టుగా మోడీ చెప్పారు. అప్పుడు పెద్దయ్యాకా ఏం చేయాలనే అంశం గురించి తను చాలా అనుకున్నట్టుగా చెప్పారు.

'అది కావాలనుకున్నా.. ఇది కావాలనుకున్నా.. అయితే రాజకీయాల్లోకి వెళ్లాలని మాత్రం ఎన్నడూ అనుకోలేదు..' అని మోడీ చెప్పారు! రాజకీయాల్లోకి తను ఏ మాత్రం ప్రణాళికలు పెట్టుకోని రాలేదని మోడీ చెప్పారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోడీ ఈ విషయాలను సెలవిచ్చారు!

మొత్తానికి తను రాజకీయాల్లోకి రావాలని అనుకోని వ్యక్తి దేశ రాజకీయాల్లో ఇలా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషమే!
Tags:    

Similar News