కొంప ముంచావు హరీశా.. గులాబీ నేతల అక్రోశం?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఒక ఆసక్తికర సన్నివేశానికి తెలంగాణ అసెంబ్లీ వేదికగా మారింది.;
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఒక ఆసక్తికర సన్నివేశానికి తెలంగాణ అసెంబ్లీ వేదికగా మారింది. టీ20 క్రికెట్ మ్యాచ్ కు తీసిపోని మలుపులు శనివారం అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్నాయి. ఏం ప్లాన్ చేసుకొని వచ్చారో కానీ హరీశ్ రావు.. అధికారపక్షానికి పగలే చుక్కలు కనిపించేలా మంత్రి పొంగులేటి కుటుంబ మైనింగ్ యవ్వారం మీద ఘాటైన వాదననను వినిపించారు.
ఉత్త మాటలు కాదు ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆయన పలు డాక్యుమెంట్లు చూపిస్తూ.. తన పదునైన వాదనను వినిపించటం మొదలు పెట్టారు. సభలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఎవరూ కూడా హరీశ్ రావు వాదనకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు తెగ ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేని పరిస్థితి. ఇటీవల కాలంలో విపక్ష నేత వాదనకు అధికారపక్షం ఇంతలా తేలిపోవటం.. కళ్ల ముందే విపక్ష అధిక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. మంత్రి పొంగులేటికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లుగా కనిపించింది.
దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ వ్యవహారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన పది నిమిషాలకు సీన్ మారింది. అప్పటివరకు హరీశ్ రావు వాదనకు తిరుగులేదన్నట్లుగా సాగిన దానికి భిన్నంగా.. సీఎం రేవంత్ ఎదురుదాడి మొదలైంది. మంత్రి పొంగులేటి ఒక్కరి అంశాన్నే హరీశ్ రావు నమ్ముకొని సభలోకి రావటం.. అందుకు భిన్నంగా సీఎం రేవంత్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మైనింగ్ వ్యవహారంలో ఎంతమంది గులాబీ నేతల పాత్ర ఉందన్న విషయాన్ని చెప్పేలా తన వాదనను వినిపించారు.
అప్పటికప్పుడు బీఆర్ఎస్ కు చెందిన నేతలు.. వారికి ఉన్న మైనింగ్ సంస్థల పేర్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి సుపరిచితమయ్యేలా సీఎం తన వాదనను వినిపించారు. అప్పటివరకు దాడి చేయటం హరీశ్ వంతు.. ఆ మాటల దెబ్బలకు కాచుకునే ఆత్మరక్షణ విధానాన్ని కాంగ్రెస్ మంత్రులు అనుసరిస్తే.. సీఎం రేవంత్ పుణ్యమా అని.. ఎదురుదాడి ముఖ్యమంత్రిది అయితే.. ఆత్మరక్షణలోకి హరీశ్ అండ్ కో వెళ్లారు.
మంత్రి పొంగులేటి అండ్ ఫ్యామిలీ వాదనకు ప్రతిగా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిన హరీశ్ రావు, ఆయన సోదరుడు మొదలు కొని మైనింగ్ శాఖను ఐదేళ్లు నిర్వహించిన కేటీఆర్ మొదలు.. పలువురు నేతల తీరును.. వారి ఘనకార్యాలు ఎంత భారీగా ఉన్నాయో తెలుసా అధ్యక్షా? అన్నట్లుగా సీఎం రేవంత్ వాదనలతో సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు విచారణకు ఆదేశిస్తారా? ఆ ధైర్యం ఉందా? అంటూ విరుచుకుపడుతున్న హరీశ్ సవాల్ కు అంతే ధీటుగా స్పందించిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో అమలు చేసిన మైనింగ్ పాలసీ మొదలు.. వివిధ ఆరోపణలు ఉన్న వారందరిపైనా సీబీసీఐడీ విచారణ చేపడతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ మాట గులాబీ నేతలకు కొత్త గుబులుగా మారింది.
అధికారపక్షానికి దెబ్బేయటమే లక్ష్యంగా మొదలైన హరీశ్ వాదన.. చివరకు తమకే భారీ దెబ్బగా మారటాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఏదో అనుకుంటే మరేదో చేశావేంటి హరీశా? అంటూ బీఆర్ఎస్ నేతలు గుసగుసలు ఇప్పుడు ఆ పార్టీలో కొత్త చర్చకు తెర తీశాయి. ఇదంతా చూసిన ఒక సీనియర్ బీఆర్ఎస్ నేత తన సన్నిహితులతో చెప్పిన మాటను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ ను ఎఫ్పుడైతే మా వాళ్లు తక్కువగా అంచనా వేయటం మానేస్తారో.. అప్పుడు మార్పు వస్తుంది. అలా జరగనంత కాలం మాకు ఇలాంటి దిమ్మ తిరిగే దెబ్బలు.. షాకులు తప్పవు. నిజమే కదా? ప్రత్యర్థిని చులకన చూడటం.. చిన్నోడిలా భావించే తీరును కేటీఆర్.. హరీశ్ లు ఎప్పుడు మార్చుకుంటారో?