రాష్ట్రం ఏదైనా కానీ మోడీ గాలే వీసింది!

Update: 2019-05-23 04:19 GMT
కౌంటింగ్ స్టార్ట్ అయి గంట దాటింది. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్క‌లు దాదాపుగా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. కొన్నిచోట్ల తొలి రౌండ్ ఫ‌లితాలు వచ్చేసి.. రెండో రౌండ్ ఫ‌లితాలు వెల్ల‌డించేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇలాంటి వేళ‌.. దేశ వ్యాప్తంగా ట్రెండ్ చూస్తే.. మోడీ గాలి మాత్ర‌మే వీచిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఇదే తీరు సాగితే ఎగ్జిట్ పోల్స్ కు మించిన సీట్లు మోడీ బ్యాచ్ ఖాతాలో ప‌డ‌టం ఖాయం. రాష్ట్రాల వారీగా చూస్తే.. బీజేపీ ప్ర‌భావం లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్..  త‌మిళ‌నాడు.. తెలంగాణ‌.. కేర‌ళ మాదిరి రాష్ట్రాల మిన‌హా.. మిగిలిన అన్నిచోట్ల బీజేపీ.. ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల దూకుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారాన్ని చూస్తే.. రాష్ట్రాల వారీగా ఫ‌లితాలు ఇలా ఉన్నాయి.

+  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిక్య‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ ప్ర‌భావం పెద్ద ఎత్తున క‌నిపిస్తోంది. రెండు చోట్ల బీజేపీ అధిక్య‌త‌లో క‌నిపిస్తున్నా.. ఈ అధిక్య‌త ఎంత‌మేర కొన‌సాగుతుందో చూడాలి. ఎగ్జిట్ పోల్స్ కు త‌గ్గ‌ట్లే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ గాలి ఓ రేంజ్లో వీస్తోంది. బీజేపీకి.. విప‌క్షాల‌కు మ‌ధ్య సీట్ల తేడా ఏ మాత్రం పోల్చ‌లేనంత ఎక్కువ‌గా ఉండ‌టం క‌నిపిస్తోంది. బీజేపీ ప‌క్షాలు 39 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉంటే.. ఎస్పీ ఒక్క స్థానంలో.. బీఎస్పీ నాలుగు స్థానాల్లో.. కాంగ్రెస్ కూట‌మి ఒక్క‌స్థానంలో అధిక్య‌త‌లో ఉంది. ఆశ్చ‌ర్య‌క‌రంగా ప‌శ్చిమ‌బెంగాల్లో బీజేపీ స్ప‌ష్ట‌మైన అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుండ‌టం విశేషం. బీజేపీ ఏడు చోట్ల అధిక్య‌త‌లో ఉంటే..తృణ‌మూల్ ఐదు చోట్ల మాత్ర‌మే అధిక్య‌త‌లో ఉంది.

ముందునుంచి అనుకున్న‌ట్లే త‌మిళ‌నాడులో మోడీ ప్ర‌భావం అస్స‌లు క‌నిపించ‌టం లేదు. ఆయ‌న జ‌ట్టు క‌ట్టిన అధికార‌ అన్నాడీఎంకే ఒక్క స్థానంలో అధిక్య‌త‌లో ఉంటే.. డీఎంకే కూట‌మి ఏకంగా 13 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క‌లో బీజేపీ పూర్తి అధిక్య‌త‌ను క‌న‌ప‌రుస్తుండ‌గా.. ఢిల్లీలో బీజేపీ.. ఆప్ లు పోటీ ప‌డుతున్నాయి. ఒడిశాలో బిజు జ‌న‌తాద‌ళ స్వ‌ల్ప అధిక్య‌త‌ను క‌న‌బ‌రుస్తోంది. గుజ‌రాత్ లో బీజేపీ హ‌వా న‌డ‌స్తుంటే.. బిహార్ లో బీజేపీ కూట‌మిదే అధిక్య‌త క‌నిపిస్తోంది. మ‌హారాష్ట్రంలో బీజేపీ.. శివ‌సేన‌లు దూసుకెళుతున్నాయి. రాజ‌స్థాన్ లోనూ బీజేపీ జోరు భారీగా క‌న‌నిపిస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మాత్రం కాంగ్రెస్ అధిక్య‌త క‌నిపిస్తుండ‌గా.. కేర‌ళ‌లో ఎల్డీఎఫ్ కూట‌మి అధిక్య‌త‌లో ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్‌.. బీజేపీల మ‌ధ్య పోరు స‌మంగా ఉంది. అసోంలో బీజేపీ అధిక్య‌త‌లో ఉండ‌గా.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.. ఉత్త‌రాఖండ్ లోనూ మోడీ గాలే వీస్తోంది.
Tags:    

Similar News