పర్లేదు మోడీకి ఆ మాత్రం క్లారిటీ ఉంది!

Update: 2016-09-01 04:30 GMT
భారతీయ జనతా పార్టీ అది సమాజంలో కేవలం కొన్ని వర్గాలకు  - తరగతులకు - కులాలకు మాత్రమే పరిమితమైన పార్టీ అనే అభిప్రాయం ప్రజల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ విషయంలో ఆ పార్టీ నాయకుడు - ప్రధాని నరేంద్రమోడీకి కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ ఉన్నట్లుంది. తమది కేవలం సంపన్నుల పార్టీ మాత్రమే అనే అభిప్రాయం ఉన్నది గనుకనే.. ఆయన ఇప్పుడు పేదలను తమ పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం గురించి ఆయన పార్టీ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. అణగారిన వర్గాలను పార్టీవైపు ఆకర్షించే ప్రయత్నాలు జరగాలని ఆయన హితవు చెబుతున్నారు.

భాజపా కొన్ని రోజులుగా కీలక అంతర్గత సమావేశాలను నిర్వహిస్తోంది. రాష్ట్రాల కోర్‌ కమిటీలతో కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయి. కేంద్రప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అనేది ఒక్కటే లక్ష్యంగా.. భాజపా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కసరత్తులో భాగంగానే.. అమిత్‌ షా ఆధ్వర్యంలో తాజాగా భాజపా రాజ్యసభ ఎంపీలతో ఓ సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. మీరు ఏ రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యారో .. ఆయా రాష్ట్రాల అంశాలను మీరు లేవనెత్తాలి అంటూ వారికి హితబోధ చేశారు. తమ పార్టీకి దూరంగా ఉండే వర్గాల ప్రజలను కూడా దగ్గరకు తీసుకోవడానికి కృషి జరగాలని ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే రాజ్యసభ ఎంపీలు అంటేనే వారు ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో ఉండరు. ''నేను మీరు వేసిన ఓట్లతో గెలవలేదు.. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం నాకులేదు. కాకపోతే.. ఆంధ్రప్రదేశ్‌ నా సొంత రాష్ట్రం గనుక చాలా సాయం చేస్తున్నా'' అంటూ ఓపెన్‌ గా వెంకయ్యనాయుడు వంటి దీర్ఘకాలిక రాజ్యసభ సభ్యులు సెలవిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే.. తాము రాజ్యసభ సభ్యులు అయినందున, కార్పొరేట్‌ కార్యక్రమాలు - అధికారిక కార్యక్రమాలు - పెద్దసభలు తప్ప.. ఓట్లు వేసే కామన్‌ లోక్లాస్‌ జనం వద్దకు తాము వెళ్లాల్సిన అవసరం ఎప్పటికీ లేదని వారిలో కొందరికి బలమైన అభిప్రాయం కూడా ఉంటోంది. అసలు పేదల వద్దకు వెళ్లడానికే సుముఖంగా ఉండని ఈ నాయకులు - ఆ పేదలను పార్టీలోకి తీసుకువచ్చేంత క్రియాశీలంగా పనిచేస్తారా? అనేది అనుమానమే?!!
Tags:    

Similar News