బాబు కజకిస్థాన్ టూర్ కు అసలు కారణం ఇదే

Update: 2016-07-10 05:11 GMT
తాజాగా విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. తన పర్యటనలో భాగంగా కజకిస్థాన్.. రష్యా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన తొలుత కజకిస్థాన్ కు వెళ్లారు. ఈ దేశంలో చంద్రబాబు పర్యటించటానికి కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి. ఈ దేశంలో పర్యటించాలని చంద్రబాబుకు ప్రధాని మోడీనే స్వయంగా చెప్పారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితికి.. కజకిస్థాన్ కు మధ్య పోలికలు చాలానే ఉన్నాయి. సోవియట్ యూనియన్ ముక్కలైన తర్వాత స్వతంత్ర దేశంగా ఏర్పడిన కజకిస్థాన్ కు బోలెడన్ని సమస్యలు. రాజధాని లేకపోవటం.. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్న ఆ దేశం.. ఇప్పుడు బాగానే వృద్ధి చెందింది.

ఈ సక్సెస్ స్టోరీ తెలుసుకోవటం కోసం.. కష్టాల్ని.. ఇబ్బందుల్ని.. సమస్యల్ని అధిగమించి.. సొంతంగా రాజధాని నగరాన్ని నిర్మించుకున్న కజకిస్థాన్ పాఠం.. చంద్రబాబుకు కొండంత స్ఫూర్తిని ఇస్తుందన్న ఉద్దేశంతోనే మోడీ.. ఆ దేశాన్ని పర్యటించాలని బాబుకు చెప్పి ఉంటారు. తాజాగా ఆయనా దేశాన్ని పర్యటించిన సందర్భంగా ప్రస్తుత కజకిస్థాన్ రక్షణమంత్రితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ మంత్రి మాట్లాడుతూ.. తమ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రాజధాని నగరాన్ని నిర్మిస్తామంటే చాలామంది వ్యతిరేకించారని.. మనకిప్పుడు రాజధాని నగర నిర్మాణం అవసరమా? అని ప్రశ్నించారని.. కానీ.. వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వ.. ప్రైవేటు.. విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు సమీకరించి.. ప్రణాళికాబద్ధంగా రాజధాని నగరాన్ని నిర్మించినట్లుగా చెప్పటం గమనార్హం.

ప్రస్తుతం తమ రాష్ట్రానికి.. కజకిస్థాన్ కు మధ్య పోలికలు చాలానే ఉన్నాయని.. ప్రధాని మోడీ తనకు తరచూ కజకిస్థాన్ గురించి చెప్పేవారని.. మీ దేశంలో వెళ్లి రమ్మని చెప్పారంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. సో.. బాబు తాజా పర్యటన వెనుక ప్రధాని మోడీ ఉన్నారన్న మాట.
Tags:    

Similar News