సీఎం జగన్ తో భేటీ తర్వాత మెగాస్టార్ ఏం చెప్పారు?

Update: 2022-01-13 11:30 GMT
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి మధ్య మర్యాదపూర్వక లంచ్ భేటీ జరగటం తెలిసిందే. దీని కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చిన చిరు.. ఎయిర్ పోర్టునుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లటం తెలిసిందే. గన్నవరంలో తనను ప్రశ్నిస్తున్న మీడియా వారితో.. భేటీ తర్వాత తాను మాట్లాడతానని.. అది కూడా గన్నవరం ఎయిర్ పోర్టులోనేనని చెప్పటం తెలిసిందే.

తాను సినిమా ఇండస్ట్రీ తరఫున వచ్చానని చెప్పిన ఆయన.. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. దాదాపు వారి భేటీ గంట పదిహేను నిమిషాలకు పైనే జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచి సెలవు తీసుకొని బయటకువచ్చిన చిరు స్పందించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ ఆనందంగా..  చాలా సంతృప్తికరంగా జరిగినట్లు చెప్పారు. పండుగ పూట ఒక సోదరుడిగా తనను ఆహ్వానించి విందు భోజనం పెట్టటం ఆనందంగా ఉందన్న ఆయన.. పది రోజుల్లో సమస్యకు పరిష్కారం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. 'ఇండస్ట్రీలో ఎవరూ దయచేసి ప్రభుత్వంపై కామెంట్లు చేయొద్దు. ఒక వారం.. పది రోజుల్లో మనకి ఆమోదయోగ్యమైన జీవో వస్తుంది. నాకు గట్టి నమ్మకం ఏర్పడింది' అని చిరు వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ నివాసంలో తనకు జరిగిన మర్యాదల గురించి చిరు చెబుతూ.. ''నాతో అప్యాయంగా మాట్లాడిన తీరు బాగా నచ్చింది. ఆయన సతీమణి భారతిగారు వడ్డించటం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారిద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సినిమా టికెట్ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాసం ఉంది. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంత్రప్తి ఒకవైపు.. ఇండస్ట్రీకి మేలు చేద్దామనేదే ప్రభుత్వ ఉద్దేశమని చెబుతున్న పరిస్థితి. కొలిక్కి రాని ఈ సమస్య జఠిలమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగారు ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటం కాదు. రెండో కోణంలోనూ వినాలని అన్నారు. ఆయన నాపై పెట్టిన నమ్మకం.. భరరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది. సినీ పరిశ్రమలో ఎవరూ మాటలు జారొద్దని కోరుతున్నా' అని వ్యాఖ్యానించారు.

సామాన్యుడికీ వినోదం అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. చిత్ర పరిశ్రమ.. ఎగ్జిబిటర్లు.. థియేటర్ల యజమానుల సాధకబాధకాల గురించి ఆయనకు వివరించా. వీటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఆమోదమైన నిర్ణయం తీసుకుంటానని.. కమిటీ తుది నిర్ణయానికి వస్తుందిన తెలిపారు' అని వ్యాఖ్యానించారు. తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నిన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన 'బలిసిన' మాటలపై ఆగ్రహంగా ఉన్న చిత్ర పరిశ్రమ.. తాజాగా చిరు చేసిన సూచనకు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News