ఆ మీడియా చేతిలో ‘చిన్నమ్మ’ స్కెచ్?

Update: 2016-12-26 14:18 GMT
తమిళనాట ఏం జరగబోతోంది? అన్న ప్రశ్నతో పాటు.. తమ దగ్గర సంచలన సమాచారం ఉందని.. తమిళ రాజకీయాల్నితీవ్రంగా ప్రభావితం చేసే అంశం ఒకటి ఈ నెల 29న చోటు చేసుకోనుందంటూ ఒక ప్రముఖ తెలుగు మీడియా సంస్థ వెల్లడిస్తున్న సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనంతరం సీఎం పదవిని చేపట్టిన పన్నీరు సెల్వం.. అపద్భాందవుడే కానీ అసలుసిసలు ముఖ్యమంత్రి కాదన్నది తాజా సమాచారం. పన్నీరు సెల్వాన్నిపద్దతిగా పక్కకు తప్పించి.. ఆయన కూర్చున్న సీఎం కుర్చీలో చిన్నమ్మ కూర్చునేందుకు స్కెచ్ వేశారని.. దానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం తమ వద్ద ఉందని చెబుతోందో తెలుగు మీడియా సంస్థ.

ఇంతకీ ఆ సంస్థ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అదెంత వరకూ వర్క్ వుట్ అవుతుందన్నది చూస్తే.. కాస్త ఆసక్తికరమైన అంశాలే కనిపిస్తాయి. ఈ నెల 29న అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చిన్నమ్మ శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తారని.. అనంతరం సీఎం పదవికి కూడా ప్రతిపాదిస్తారని.. అందుకు తగ్గట్లుగా వ్యూహ రచన జరిగిందన్నది సదరు మీడియా వాదన.

తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించనున్న ఈ చర్య గురించి తమకు ఉప్పందిందన్న సదరు మీడియా మాటల్లో అంత పస లేదన్న అభిప్రాయాన్ని తమిళ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. ఎందుకంటే.. పన్నీరుసెల్వం నుంచి పగ్గాలు తీసుకోవటం చిన్నమ్మకు అంత తేలికైన విషయం కాదని.. అందుకు అడ్డంకులు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. అమ్మ మీద ఉన్న భక్తి మీదా.. ప్రజలకు ఆమె మీదున్నఅభిమానమే చిన్నమ్మకు గౌరవాన్ని ఇస్తుందన్న విషయాన్నిమర్చిపోకూడదని.. పదవీ కాంక్ష ఉన్నట్లుగా ప్రజలు గ్రహిస్తే ఛీ కొట్టటం ఖాయమన్న మాటను వారు చెబుతున్నారు. సామాజికంగా చూసినా.. అధికార బదిలీ అంత సులువు కాదని.. కిందిస్థాయి కార్యకర్తల్లో శశికళకు అంత పట్టులేదన్న విషయాన్ని మర్చిపోకూడదని వారు చెబుతున్నారు. చిన్నమ్మ స్కెచ్ తమ దగ్గర ఉందంటూ చెబుతున్న మాటల్లో వినిపిస్తున్నంత సౌండ్.. వారు చెబుతున్న దాన్లో లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవం ఏమిటన్నది మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే సరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News