కాల్పుల ముందు మనోళ్లను వాడు అడిగిందిదే..

Update: 2017-02-26 04:31 GMT
తలకెక్కిన విద్వేషం ఎన్ని దారుణాలకు దారి తీస్తుందో.. అమెరికాలోని కేన్సస్ లోని మనోళ్లపై జరిపిన కాల్పుల ఉదంతం ఒక నిదర్శనం. కాల్పుల ఘటన విద్వేషపూరితం కానే కాదంటూ వైట్ హౌస్ ప్రకటించినప్పటికీ.. అది ముమ్మాటికి విద్వేషపూరిత చర్యేనని చెప్పే బలమైన వాస్తవాన్ని.. కాల్పుల ఘటనలో గాయపడిన మరో తెలుగోడు మాదసాని అలోక్ స్పష్టం చేస్తున్నారు. కూఛిబొట్ల శ్రీనివాస్ తో కలిసి అస్టిన్స్ బార్ అండ్ గ్రిల్ కు వెళ్లిన అలోక్.. అక్కడ దుండగుడు ఆడమ్ ప్యూరింటన్ కాల్పులు జరపటం తెలిసిందే.

కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన అలోక్ ను ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధితో అలోక్ మాట్లాడారు. కాల్పులకు ముందు అసలేం జరిగిందన్న విషయాన్ని వెల్లడించారు. తమ మానాన తాము బార్ లో ఉండగా.. ప్యూరింటన్ తమ దగ్గరకు వచ్చాడని.. ఏ వీసా మీద మీరు అమెరికాకు వచ్చారని ప్రశ్నించినట్లు చెప్పాడు. అలాంటి ప్రశ్నలకు తాము స్పందించకూడదని నిర్ణయించుకున్నామని.. అందుకే తాము మాట్లాడలేదన్నారు.

కొందరు మతి లేని పనులు చేస్తుంటారని.. ప్యూరింటన్ మితిమీరి ప్రవర్తించాడన్నారు. తాము ఏ వీసాల మీద అమెరికాకు వచ్చామన్న విషయాన్ని ప్రశ్నించిన ప్యూరింటన్ వెళ్లిపోయి.. కాసేపటికి గన్ తో వచ్చి తమపై కాల్పులు జరిపినట్లుగా వెల్లడించారు. వెనక్కి వచ్చిన ప్యూరింటన్ తమపై గట్టిగా అరవటం మొదలుపెట్టాడని.. దీంతో బార్ మేనేజర్ ను తీసుకొచ్చేందుకు తాను వెళ్లానని.. తిరిగి వచ్చేసరికి అతడు వెళ్లాడని.. కాసేపటికే తిరిగి వచ్చి కాల్పులు జరిపినట్లుగా వెల్లడించాడు. ప్యూరింటన్ మొత్తంగా తొమ్మిది సార్లు కాల్పులు జరిపినట్లుగా వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. కాల్పులు జరిగిన బార్ సిబ్బంది కాల్పులు జరిగిన శ్రీనివాస్.. అలోక్ ల గురించి చెబుతూ..వారిద్దరూ చాలామంచివారని.. తమ బార్ కు వచ్చి తమ దారిన తాము వెళ్లేవారని.. ఎవరితోనూ గొడవపడటం తాము చూడలేదని చెప్పటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News