మోడీ సాబ్ మీరు సూపర్.. నెలలో రెండోసారి గ్యాస్ బాదుడు

Update: 2020-12-16 03:45 GMT
బాదితే అలా ఇలా కాదు. దిమ్మ తిరిగిపోవాలి. ఆ దెబ్బకు నోటి వెంట వచ్చే కేకలు సైతం గొంతును దాటకూడదు. విషయం ఏదైనా కానీ.. మోడీ తర్వాతే ఎవరైనా అన్న భావన కలగాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురుధరలు అంతంతమాత్రంగానే ఉన్నా.. దేశీయంగా లీటరు పెట్రోల్ రూ.90 దాటేసి.. రూ.92 వరకు వచ్చేసిన పరిస్థితి. ఇక.. డీజిల్ సైతం తన జీవితకాలంలో ఎప్పుడూ లేనంత గరిష్ఠస్థాయికి చేరుకుంది. ఎందుకింత ధరలు అన్నంతనే ‘దేశభక్తి’ లేదా అంటూ ప్రశ్నించే తీరు చూస్తే.. దేశభక్తికి.. డీజిల్ కు లింకేమిటో అర్థం కాక నోటి వెంట మాట రాని పరిస్థితి.

పెట్రోల్.. డీజిల్ ధరలు భగ్గుమంటున్న వేళ.. నేనేం పాపం చేశాను.. నన్ను తగ్గించి చూపిస్తే ఏం బాగుంటుందని ఫీల్ అయ్యిందేమో కానీ.. వంటింటి వెలుగుల్ని ఇచ్చే గ్యాస్ బండ  సగటుజీవి బడ్జెట్ పైన బండ పడేలా చేసింది. రెండు వారాల వ్యవధిలో రెండుసార్లు.. అది కూడా ఏకంగా రూ.100 చొప్పున సిలిండర్ కు బాదేస్తున్న వైనం చూస్తే.. ఇలాంటి ఘనత మోడీ వారికి మాత్రమే సాధ్యమనిపించక మానదు. డిసెంబరు 2న ఇంటి అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.40కు పెంచగా.. డిసెంబరు 15న (అంటే నిన్న.. మంగళవారం) మరో రూ.60 పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు వారాల వ్యవధిలో రూ.100 భారం పడిపోయింది.

అదే సమయంలో నగదు బదిలీ రూపంలో వినియోగదారుడి ఖాతాలో వేసే రాయితీ ఊసే లేకపోవటం మరో విచిత్రంగా మారింది. ఈ ఏడాది జనవరిలో రూ.769 ఉన్న సిలిండర్ ధర మార్చిలో రూ.862కు చేరింది. ఆ తర్వాత మేలో భారీగా తగ్గి రూ.589కు చేరింది.ఆ తర్వాత నుంచి కాస్త చొప్పున పెరుగుతూ ఉంది. డిసెంబరు 2 నాటికి రూ.686 కాగా.. నిన్న రాత్రి (మంగళవారం) నుంచి రూ.746.50కు చేరింది. ఏప్రిల్ వరకు రాయితీ సొమ్ము సిలిండర్ కు రూ.206 చొప్పున ఇస్తే.. నవంబరు నాటికి సిలిండర్ కు రూ.40.71చొప్పున జమ చేశారు. తాజాగా అది కూడా లేకపోవట గమనార్హం. ఏమైనా.. బాదేయటంలో మీకు సరిరారు ఎవ్వరు మోడీ సాబ్.
Tags:    

Similar News