భ‌ట్టిని లేపుతూ.. రేవంత్‌కు చెక్‌!

Update: 2022-03-11 11:11 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో అధికార టీఆర్ఎస్‌కు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఆయ‌న మ‌రింత దూకుడుతో సాగుతున్నారు. సీఎం కేసీఆర్‌పై, అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

మ‌రోవైపు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట కార్య‌క్ర‌మాల‌తో పార్టీ శ్రేణుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తున్నారు. ఆయ‌న సార‌థ్యంలో కాంగ్రెస్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు గ‌ట్టిపోటీనిచ్చేలా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో రేవంత్ జోరుగా చెక్ పెట్టాల‌ని భావిస్తున్న కేసీఆర్ త‌న‌యుడు ఐటీ మంత్రి కేటీఆర్ అందుకు వ్యూహం ర‌చించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియ‌ర్ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ను లేపుతూ.. రేవంత్‌కు చెక్ పెట్టాల‌ని కేటీఆర్ భావిస్తున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అందుకే స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా సీఎల్పీ నేత అయిన భ‌ట్టిపై కేటీఆర్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నార‌ని అంటున్నారు. పార్టీలో భ‌ట్టి మాట చెల్లుబాటు కావ‌డం లేద‌ని.. కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేదంటూ కేటీఆర్ వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

తాజాగా అసెంబ్లీలోనూ కేటీఆర్ మ‌రోసారి అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. కాంగ్రెస్‌లో భ‌ట్టి విక్ర‌మార్క మాట న‌డ‌వ‌డం లేద‌ని.. గట్టి అక్ర‌మార్కుల మాటే న‌డుస్తుంద‌ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడి గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిద‌ని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అవిభ‌క్త క‌వ‌ల‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని కేటీఆర్ ఆరోపించారు.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త పోరుకు కొద‌వ‌లేదు. టీపీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేపట్టిన త‌ర్వాత రేవంత్ రెడ్డి ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే రేవంత్‌పై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిక భ‌ట్టి విక్ర‌మార్క‌ను వాడి రేవంత్ను మ‌రింత ఇర‌కాటంలో పెట్టాల‌ని కేటీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News