పంచాయితీ ముగిసింది..ఉగాది ఎప్పుడో తేలింది

Update: 2017-03-19 05:36 GMT
తెలుగు సంవత్సరాది ఎప్పుడున్న అంశంపై స్పష్టత వచ్చేసింది. కొన్నాళ్లుగా తెలుగు పండగలపై స్పష్టత లేకపోవటం.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా తెలుగు ప్రజల కొత్త సంవత్సరమై ఉగాదిపై తర్జనభర్జనలు సాగుతోంది. ఉగాది ఈ నెల 28న అని కొందరు అంటుంటే.. మరికొందరు ఈ నెల29న అంటూ వాదిస్తున్నారు. ఈ అంశం మీద పండితుల మధ్య కూడా ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవటంతో గందరగోళం సాగుతోంది. దీంతో.. ఉగాది ఎప్పుడు చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో.. ఇంతకాలం సాగుతున్న కన్ఫ్యూజన్ కు తెర దించుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఉగాదిని  ఈ నెల 29నే జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఇంతకాలం సాగుతున్న గందరగోళానికి తెర దించారు. ఉగాదిని 29నే జరపాలని నిర్ణయించటంతో పాటు.. ప్రభుత్వం తరఫున ప్రకటన చేయనున్నారు. తాజాగా రమణాచారిని కొందరు పండితులు కలిసి.. ఈ నెల 29నే ఉగాదిని నిర్వహించాలని కోరుతూ.. అందుకు కారణాల్ని ఆయన దృష్టికి  తీసుకెళ్లారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన రమాణాచారి.. తెలంగాణ ప్రభుత్వం 29నే ఉగాదిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పండుగలు జరుపుకునే విషయంపై గందరగోళం లేకుండా ఒక విధానాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి పండుగల సందర్భంగా తలెత్తే గందరగోళానికి పుల్ స్టాప్ పెడుతూ.. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు విద్వత్సభను ఏర్పాటు చేసి..సిద్ధాంతుల సమ్మేళనంలో పండుగల్ని ఎప్పుడెప్పుడు జరుపుకోవాలో నిర్ణయిస్తామన్నారు. నిజానికి ఇలాంటి ఏర్పాటు ఎప్పుడో ఏర్పాటు జరగాల్సి ఉంది. అదే జరిగి ఉన్నట్లైతే.. పండుగల్ని జరుపుకునే కోట్లాది మంది అదే పనిగా గందరగోళానికి గురి కావాల్సిన అవసరమే ఉండేది కాదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News