కుమారస్వామి సర్కారు.. కొన్ని గంటలేనా!

Update: 2019-07-17 11:32 GMT
కర్ణాటక రెబెల్స్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో కూడా కుమారస్వామి సర్కారుకు ఎలాంటి భరోసా దక్కకపోవడం గమనార్హం. రెబెల్స్ రాజీనామాలపై కోర్టు అసెంబ్లీ స్పీకర్ కే అధికారాన్ని ఇచ్చింది. వారి రాజీనామాలను ఆమోదించడం - ఆమోదించకపోవడం స్పీకర్ విచక్షణ అని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో స్పీకర్ పై ఫిర్యాదులతో కోర్టుకు ఎక్కిన ఎమ్మెల్యేలకు ఊరట లభించలేదనే చెప్పాలి.

అయితే ఆ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించకపోయినప్పటికీ.. కుమారసర్కారు నిలబడే అవకాశాలు అయితే కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. గురువారం కుమారస్వామి సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెబెల్ ఎమ్మెల్యేలు కుమారకు అనుకూలంగా ఓటు వేయని పక్షంలో ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నాయి.

అసెంబ్లీలో బలాబలాలను బట్టి చూస్తే.. సంకీర్ణ ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నాయి. అయితే విశ్వాస పరీక్షలోగా కనీసం సగం మంది రెబెల్స్ ను కుమార బుజ్జగించుకోగలిగితే కథ వేరేలా ఉంటుంది.

అయితే సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడం ఖాయమనే లెక్కలతో ఉంది భారతీయ జనతా పార్టీ. కుమారస్వామి ప్రభుత్వం పడిపోతే అధికారం తమకే దక్కుతుందని కమలనాథులు పూర్తి విశ్వాసంతో కనిపిస్తూ ఉండటం గమనార్హం. విశ్వాస పరీక్ష నేపథ్యంలో కూడా వారు తాపీగానే కనిపిస్తూ ఉన్నారు. కర్ణాటకలో తమకు అధికారం చేజిక్కడం ఖాయమనే అంచనాలతో ఉన్నారు!

కర్ణాటక మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224 కాగా వారిలో  15 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అలిగారు. వారు సభకు వచ్చేది లేదని అంటున్నారు. దీంతో మొత్తం బలం 209 అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ 105గా నిలుస్తుంది. కాంగ్రెస్-జేడీఎస్ కు ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య 101 అని అంచనా. బీజేపీ బలం 107గా ఉంది. దీంతో కుమారస్వామి సర్కారు మరి కొన్ని గంటల మాత్రమే మనుగడలో ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News