పాత విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అయ్యే ఛాన్సే లేదన్న కేటీఆర్

Update: 2020-12-16 03:13 GMT
దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వానికి లేని దమ్ము.. ధైర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొంతమని చెప్పక తప్పదు. ఇది చదివిన వెంటనే.. కేసీఆర్ కు భజన బ్యాచ్ గా మారామన్నభావన కలిగిందా? అలాంటిదేమైనా కలిగే.. దాన్ని అర్జెంట్ గా తుడిపేయండి. ఎందుకంటే.. విషయం మొత్తం చదివితే.. మొదటి లైన్ చదివినంతనే కలిగిన ఫీలింగ్ కు.. చివర్లో కలిగే భావనకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఇంతకీ మ్యాటర్ ఏమంటే.. మూడు నెలలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపేసిన తెలంగాణ సర్కారు.. ఇటీవల రిజిస్ట్రేషన్లను షురూ చేయటం తెలిసిందే.

రిజిస్ట్రేషన్లు షురూ కావటానికి కాస్త ముందుగా.. రాష్ట్ర హైకోర్టు పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు తక్షణమే షురూ చేయాలని చెప్పింది. దీనికి తగ్గట్లే ప్రభుత్వం సైతం ఓకే చేసింది. తీరా రిజిస్ట్రేషన్లు చేయటం మొదలు పెట్టిన తర్వాత చూస్తే కానీ చాలామందికిఅర్థం కాని పరిస్థితి. హైకోర్టు చెప్పినట్లుగా.. ప్రభుత్వం ఓకే చేసినట్లుగా పాత పద్దతిలో వ్యవసాయేతర ఆస్తుల్నిరిజిస్ట్రేషన్ చేయటం లేదన్న విషయం అర్థం కాక మానదు. గతంలో కార్డు సిస్టం ఉండేది. అందులో స్లాట్ బుక్ చేసుకునే పద్దతికి.. ఇప్పుడు స్లాట్ చేసుకునే విధానానికి ఏ మాత్రం పొంతన ఉండని పరిస్థితి.

దీంతో.. మూడునెలల తర్వాత స్లాట్ బుకింగ్ కు ఓకే చెప్పిన తర్వాతకూడా.. రిజిస్ట్రేషన్లు జరగని పరిస్థితి. దీనికి కారణం.. స్లాట్ బుక్ కావటం మామూలు వారికి సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే.. ఎన్నో ఫీచర్లు లేకపోవటం.. చాలా పరిమితులు ఉండటంతో గతంలో మాదిరి రిజిస్ట్రేషన్లు కాలేని పరిస్థితి. దీంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. డాక్యుమెంట్ రైటర్లు మొదలుకొని.. అన్ని వర్గాల వారికి దెబ్బ పడే పరిస్థితి. ఈ నేపథ్యంలో కడుపు మండిన వారంతా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయటం షురూ చేశారు.

ఇప్పటికే రిజిస్ట్రేషన్లు నిలిపివేయటం వల్ల టీఆర్ఎస్ సర్కారు తీవ్రంగా బద్నాం అయ్యింది. దీని పుణ్యమా అని గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపిన దుస్థితి. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోడ్ల మీదకు రావటంతో కంగారు పడిన ప్రభుత్వం.. తాజాగా మంత్రి కేటీఆర్.. ప్రశాంత్ రెడ్డిలతో పాటు ఇతరు నేతలు.. అధికారులతో పాటు.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని చర్చలకు పిలిచింది.

ఈ భేటీలో జరిగిన విషయాలన్ని సీక్రెట్ గా ఉంచాలనుకున్నారు. ఇక.. మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారన్న విషయాన్ని చూస్తే.. వ్యవసాయేతర ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్ని పాత పద్దతిలో (కార్డు విధానంలో) రిజిస్ట్రేషన్ చేయటానికి వీల్లేదని తేల్చేశారు. మంచి కానీ చెడు కానీ ఇన్నాళ్లు ఆగిన.. కొత్త మార్పు కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మళ్లీ పాత విధానంలోకి వెళ్లమని.. కొత్తగా అమల్లోకి తెచ్చిన విధానాన్నే పక్కాగా ఫాలో అవుతామని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంత్రి కేటీఆర్ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. దీని కారణంగా.. ఇప్పుడు మాంచి ఊపు మీద ఉన్న వ్యాపారాలు మళ్లీ స్లో అవుతాయని.. ఇప్పటి మాదిరి ఊపు మీదకు రావటం అంత తేలికైన విషయం కాదంటున్నారు.
Tags:    

Similar News