గంటలో కరీంనగర్.. 2 గంటల్లో బెజవాడ?

Update: 2020-08-14 04:30 GMT
హైదరాబాద్ నుంచి గంట వ్యవధిలో కరీంనగర్ చేరుకోవటం.. అదే విధంగా హైదరాబాద్ మహానగరం నుంచి రెండు గంటల్లో విజయవాడకు చేరుకోవటం సాధ్యమా? అంటే.. సాధ్యమేకాదని చెబుతారు. ఆ మాటకు వస్తే..హైదరాబాద్ నుంచి నగర శివారుకు చేరుకోవటానికే గంటకు పైగా సమయం పట్టే పరిస్థితి. అలాంటిది అంత తక్కువ వ్యవధిలో సాధ్యం కాదనటం ఖాయం. కానీ.. అదేమీ కష్టం కాదని.. వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్లతో సాధ్యమని చెబుతున్నారు మంత్రి కేటీఆర్.

 ఢిల్లీ - వారణాసి మధ్య నడిచే వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే.. తాను చెప్పినట్లుగా తక్కువ సమయంలోనే దూర ప్రాంతాలకు వెళ్లొచ్చని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి చేరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లుగా చెప్పారు కేటీఆర్. అంతేకాదు.. ఇప్పట్లో పన్నెండు గంటల సమయం తీసుకునే హైదరాబాద్ - బెంగళూరు కూడా కేవలం నాలుగు గంటల్లోనే వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామ శివారులో మేధా సంస్థ నిర్మించనున్న రైల్ కోచ్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సందర్భంగా కేటీఆర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన యుగంధర్ రెడ్డి స్థాపించిన మేధా సంస్థ అంతకంతకూ ఎదిగి.. ఈ రోజున రైల్వే కోచ్ లు.. లోకోలు తయారు చేసే స్థాయికి చేరుకుందన్నారు కేటీఆర్.

అంతేకాదు..గంటకు 160కి.మీ. వేగంతో నడిచే వందే భారత్ రైలుకు సిగ్నలింగ్ తో పాటు అనేక పరికరాలు తయారు చేసే సంస్థగా మేధాకు గుర్తింపు ఉందని చెప్పారు. వెయ్యి కోట్ల పెట్టుబడితో వచ్చే ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి.. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. పది నుంచి పదిహేను నెలల వ్యవధిలోనే రైల్ కోచ్ పరిశ్రమలో మొదటి యూనిట్ పూర్తి చేస్తామని.. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని  మేధా సంస్థ చెబుతోంది. ఏమైనా.. రానున్న రోజుల్లో మరింత మంచిగా ఉంటాయన్న మాట ఆసక్తికరమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News