వాటే గేమ్ ప్లాన్‌:వార‌సుడి ప‌ట్టాభిషేకం కోసమేనా?

Update: 2017-04-07 04:35 GMT
మాస్ట‌ర్ మైండ్ కేసీఆర్ ప్లానింగ్ ఎంత ప‌క్కాగా ఉంటాయో తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్ని నిశితంగా ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది. ఎలాంటి ఎన్నిక‌లు లేకున్నా.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ స‌భ‌ల్ని ఏర్పాటు చేయ‌టం.. ఎన్నిక‌ల‌వేళ‌లో ఎలా అయితే హ‌డావుడి ఉంటుందో అంతేలా హ‌డావుడి చేయ‌టం ఒక ఎత్తు అయితే.. అంత పెద్ద స‌భ‌ల‌కు దూరంగా కేసీఆర్ ఉండ‌టం.. ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేసే స‌త్తా త‌న‌కుంద‌న్న రీతిలో మంత్రి కేటీఆర్ మాట‌లు.. చేత‌లు ఉండ‌టం చూస్తే త్వ‌ర‌లో ఏదో పెద్ద నిర్ణ‌యం దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

మొన్న‌టికి మొన్న పెద్ద‌ప‌ల్లి.. ఆ త‌ర్వాత తాండూరు.. త‌ర్వాత కొల్లాపూర్‌.. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌ల్లో కేటీఆర్ చెల‌రేగిపోతున్న తీరు చూస్తే.. గులాబీ కారు స్టీరింగ్ త‌న చేతుల్లోకి తీసుకునేదిశ‌గా కేటీఆర్ న‌డుస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. త‌న నిర్ణ‌యానికి ప్ర‌జ‌ల ఆమోదం ప‌లికేందుకు వీలుగా.. కొడుక్కి కొత్త త‌ర‌హా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌ట‌మే కాదు.. తాను తీసుకున్న నిర్ణ‌యం స‌మ‌ర్థ‌త కార‌ణంగానేన‌న్న భావ‌న క‌లిగేలా చేయ‌టం కేసీఆర్‌ కు అల‌వాటే. తాజాగా కేటీఆర్‌ ను ప్ర‌జంట్ చేస్తున్న తీరును చూస్తే.. ఇదే విష‌యం అర్థ‌మ‌వుతుంది.

పార్టీలో ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆరే సుప్రీం. ఆ విష‌యంలో ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కానీ.. ఆయ‌న త‌ర్వాత ఎవ‌ర‌న్న విష‌యంలో కాసిన్ని క‌న్ఫ్యూజ‌న్లు ఉన్నాయి. అలాంటి వాటికి గ‌డిచిన కొద్ది నెల‌లుగా త‌న నిర్ణ‌యాల‌తో త‌న కొడుకు కేటీఆర్ అన్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేసిన కేసీఆర్‌.. తాజాగా మాత్రం ఆ విష‌యాన్ని జ‌నాల‌కు అర్థ‌మ‌య్యేలా చేయ‌టం కోసమే తాజాగా నిర్వ‌హిస్తున్న భారీ బ‌హిరంగ స‌భ‌లుగా చెబుతున్నారు.

త‌ర‌చూ అనారోగ్యానికి గురిఅవుతున్న వేళ‌.. పార్టీ ప‌గ్గాల్ని కొడుక్కి క‌ట్ట‌బెట్ట‌టం.. త‌న మార్గ‌ద‌ర్శ‌కంలో ప‌ని చేసేలా చూడ‌టంతో పాటు.. త‌న వార‌సుడిగా కొడుకును ఫోక‌స్ చేయ‌టం లాంటి కార్య‌క్ర‌మాల్ని హ‌డావుడిగా కాకుండా.. ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్‌.. అందుకుత‌గ్గ‌ట్లే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే పెద్ద నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ స్వ‌యంగా భారీ బ‌హిరంగ స‌భ‌ల్ని ఎలా లీడ్ చేస్తార‌న్న లిట్మ‌స్ టెస్టుల్ని నిర్వ‌హిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే.. కేటీఆర్ త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా చెప్పాలి. తాజాగా నిర్వ‌హించిన ఆర్మూర్ స‌భ‌లో అన్నాచెల్లెళ్లు ఇద్ద‌రూ పాల్గొన‌టం.. వారి మ‌ధ్య అన్యోన్య‌త ఉట్టిప‌డేలా ప‌లు దృశ్యాలు ప‌లువురిని ఆక‌ట్టుకున్నాయి.కేసీఆర్ లేకుండా.. ఈ ఇద్ద‌రూ క‌లిసి పాల్గొన్న మొద‌టి భారీ బ‌హిరంగ స‌భ‌గా చెప్పాలి. ఈ స‌భ‌లో కేటీఆర్‌ ను నిశితంగా ప‌రిశీలిస్తే.. త‌న తండ్రి మాదిరి చేతికి ప‌ట్టీ క‌ట్టుకోవ‌టం.. ఆయ‌న్ను అనుక‌రించేలా మాట‌లు చెప్ప‌టం క‌నిపించింది. మ‌రీ.. ముఖ్యంగా తానీ స‌భ‌కు వ‌స్తుంటే త‌న భార్య త‌న‌తో అన్న మాట‌ల్ని కేటీఆర్ ప్ర‌స్తావించారు. వాస్త‌వానికి ఆయ‌న ఎప్పుడూ ఆ త‌ర‌హాలో మాట్లాడ‌టం క‌నిపించ‌దు. త‌న భార్య‌ను పెద్ద‌గా ప్ర‌స్తావించ‌ని కేటీఆర్‌.. తాజా బ‌హిరంగ స‌భ‌లో మాత్రం త‌న తండ్రి మాట‌ల్ని అనుక‌రించే ప్ర‌య‌త్నాన్ని స‌క్సెస్ ఫుల్ గా చేప‌ట్టార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అదే స‌మ‌యంలో.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల్ని స‌మ‌ర్థంగా వివ‌రించ‌టం.. విప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌టం లాంటి విష‌యాల్లోనూ కేటీఆర్ త‌న పాత్ర‌ను నూటికి నూరుపాళ్లు న్యాయం చేసిన‌ట్లుగా అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ప‌రిణామాల‌న్నీ గులాబీ కారు స్టీరింగ్‌ ను కేటీఆర్‌ కు అప్ప‌గించే క్ర‌మంలోనే చోటు చేసుకుంటున్నాయ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. పార్టీలో కేటీఆర్ పాత్ర మార‌నున్న విష‌యాన్ని పార్టీ వ‌ర్గాలుకూడా బాగానే గుర్తించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. తాజా ఆర్మూరు స‌భ‌లో సంఘాల వారీగా కేటీఆర్‌ ను స‌త్క‌రించేందుకు పోటీ ప‌డ‌టం క‌నిపిస్తుంది. ఇక‌.. అన్నాచెల్లెళ్లు (కేటీఆర్‌.. క‌విత‌) ఇద్ద‌రు ఒక‌రిని ఒక‌రు పొగిడేసుకోవ‌టం కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News