కాంగ్రెస్ వృద్ధ నేత చెప్పారని కేటీఆర్ ప్రచారానికి వెళ్లట్లేదట!

Update: 2020-01-17 11:55 GMT
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి.. సమకాలీన రాజకీయాల్లో వారసుల పుత్రరత్నాల్లో చాకుల్లాంటి నేతలు జాబితా తీస్తే టాప్ త్రీలో కేటీఆర్ పేరు కచ్ఛితంగా ఉండి తీరుతుంది. ఎప్పుడేం మాట్లాడాలి? ఎక్కడెలా వ్యవహరించాలి? ఎవరిని ఎప్పుడు ఎటకారం చేసుకోవాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. పెద్దలంటే భయం భక్తులు.. వినయ విధేయత రామ అన్నట్లుగా ఉంటూనే.. వాతల్లాంటి మాటలతో వ్యంగ్యస్త్రాల్ని సంధించటంలో మంచి పట్టే ఉందని చెప్పాలి.

తనకు అనుకూలంగా ఉన్న సవాళ్లను తనకు తానుగా స్వీకరించటం..తనను ఇబ్బంది పెట్టే సవాళ్లను అస్సలు పట్టించుకోకపోవటం కేటీఆర్ కు కొత్తేం కాదు. తెలంగాణ పెద్దాయనగా చెప్పుకునే జానారెడ్డి లాంటి సీనియర్ నేతను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసే కేటీఆర్.. కాంగ్రెస్ వృద్ధ నేతల్లో ఒకరైన కోదండ రెడ్డి నోటి వచ్చిన మాటకు చాలా విలువనిస్తూ.. ఆయన సూచనను పాటిస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్లటం లేదన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

పుర ఎన్నికల ఫలితాలు తన పనితీరుపై తీర్పుగా చెప్పానని.. అయితే.. పని తీరుపట్ల విశ్వాసం ఉంటే ప్రచారం చేయొద్దని కాంగ్రెస్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కోదండరెడ్డి చేసిన సూచనను పాటిస్తున్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన సూచనను శిరసా వహిస్తూ స్వాగతిస్తూ.. బయటకు ప్రచారానికి వెళ్లనంటే వెళ్లనని తేల్చేశారు. ఓపక్క సీనియర్ నేత మాటను స్వీకరిస్తున్నట్లు కలర్ ఇచ్చినా.. తనకు కన్వీనియంట్ గా ఉన్న కారణంతోనే కేటీఆర్ నోటి నుంచి ఈ మాటలు వచ్చినట్లు చెప్పక తప్పదు. పుర ఎన్నికలు దాదాపుగా ఏకపక్షంగా జరుగుతున్న వేళ.. ప్రచారానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. అయితే.. మిగిలిన కాంగ్రెస్ నేతల సవాళ్ల మీద స్పందించని కేటీఆర్.. తెర మీదకు పెద్దగా రాని కోదండరెడ్డి లాంటి పెద్దాయన మాటలకు అంత విలువ ఇవ్వటంలో అసలు కామెడీ అర్థమైందా?


Tags:    

Similar News