దమ్ము లేకుంటే జగన్ కాళ్లు పట్టుకో చంద్రబాబు

Update: 2020-09-19 17:13 GMT
అమరావతి భూముల వ్యవహారం, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాల్లో తమ అవకతవకలు బయటపడకుండా ఉండేందుకు టీడీపీ నేతలు అనేక రకాలుగా విచారణను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు కేసులంటే భయమని, అందుకే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చిదంబరం కాళ్లు పట్టుకున్నారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇపుడు కూడా కేసులు, విచారణ, దర్యాప్తులంటే చంద్రబాబుకు భయమని, కేసులను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేకుంటే చీకట్లో సీఎం జగన్ కాళ్లు పట్టుకోవాలని షాకింగ్ కామెంట్లు చేశారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన కొన్నవ్యవస్థలను వాటిలోని లొసుగుల ఆధారంగా కొందరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, తమకు అనుకూలంగా వాటిని మార్చుకుంటున్నారని విమర్శించారు.140 కోట్ల ప్రజలను ఏమైనా చేయగలమని కొన్ని వ్యవస్థలు అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నాయని, ఆ వ్యవస్థలపై దమ్ము, ధైర్యంతో స్పందించాల్సిన అవసరం ఉందని నాని స్పష్టం చేశారు.

జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలోని కొన్ని పరిణామాలు రాష్ట్ర, దేశ ప్రజలకు పలు అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్. భూములు కొనుగోలుపై సీఎం జగన్ చిత్తశుద్ధితో విచారణకు ఆదేశించారని అన్నారు.అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ కోసం కేంద్రాన్ని జగన్ కోరారని, కేంద్రం స్పందించకపోవడంతో సిట్, సీఐడీ విచారణకు ఆదేశించారని చెప్పారు. కానీ, ఆ విచారణకు టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసి అడుగడుగునా అడ్డం పడుతున్నారని విమర్శించారు. తాను నిజాయితీపరుడినంటూ సొల్లు నాయుడు ఎన్నో ప్రగల్భాలు పలికారని, ఇపుడు స్టేల మీద స్టేలు కోరుతూ భయపడుతున్నారని చంద్రబాబును ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఇద్దరు ముగ్గురు ఎంపీలను అడ్డంపెట్టుకుని ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ఇలా ఎంతమంది ఎన్ని ఆటంకాలు సృష్టించినా.... సీఎం జగన్ దమ్ము, ధైర్యంతో ముందుకు వెళుతున్నారని, ఎదుటివారు ఎంతటి వాళ్లయినా ఢీకొట్టే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగన్ అని నాని కొనియాడారు. జగన్ వంటి నేత నభూతో నభవిష్యత్ అని నాని ప్రశంసించారు.

గతంలో తాను ఎన్టీఆర్ వద్ద పనిచేయలేకపోయాని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద పనిచేయలేకపోయానని, సీఎం జగన్ మంత్రివర్గంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఒక మగాడి వద్ద, ఒక నిజాయతీపరుడి వద్ద, అవతల కొండలు ఉన్నా ఢీకొట్టగల ధీశాలి వద్ద పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నానని నాని అన్నారు. పైనున్న దేవుడ్ని, కింద ఉన్న ప్రజల్ని నమ్మి షంషేర్ లా ముందుకు వెళ్లే నాయకుడు జగన్ అని, దేశ చరిత్రలో ఇలాంటి నాయకుడు మరొకరు లేరని కితాబిచ్చారు నాని.
Tags:    

Similar News