అల్లర్లకు భారీ ప్లాన్.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-11-25 18:29 GMT
తెలంగాణలో, హైదరాబాద్ లో కొన్ని అరాచక శక్తులు ఘర్షణలు సృష్టించి మత విద్వేశాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని.. వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని సీఎం అన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు అంజనీ కుమార్, విసి సజ్జనార్, మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని.. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు, శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. సంఘ విద్రోహ శక్తులను అణిచివేసే విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని సీఎం ప్రకటించారు.

సీఎం కేసీఆర్ సమీక్షలో మాట్లాడారు.  ‘‘జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ది పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నారు. అయినప్పటికీ సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు వారి కవ్వింపు మాటలను, అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలు కూడా హైదరాబాద్ లో నడవవు అని వారికి తెలిసింది. దీంతో వారు మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.’’ అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ ప్రశాంతతను ఫణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదని కేసీఆర్ ఆదేశించారు. అధికార పార్టీ సభబ్యులైనా సరే వదలొద్దని.. కుట్రలను భగ్నం చేయాలని సీఎం పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
Tags:    

Similar News