రైతులకు కేసీఆర్ గిఫ్ట్.. ప్రతిపక్షాలకు షాక్

Update: 2020-05-08 12:30 GMT
తెలంగాణలో తనను వేలెత్తి చూపించే అవకాశమే ప్రతిపక్షాలకు ఇవ్వడం లేదు సీఎం కేసీఆర్. పోనీ చూపించినా అంతలోనే చర్యలు తీసుకుంటూ ప్రతిపక్షాలకు ఇష్యూనే లేకుండా చేస్తున్నారు. నిన్న గాక మొన్న రైతుల కోసం నిరసన దీక్ష చేసిన పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు గిఫ్ట్ ఇస్తూ.. ప్రతిపక్షాలకు షాకిచ్చారు.

కరోనా- లాక్ డౌన్ తో వలస కార్మికులతోపాటు రైతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. తెలంగాణలో భారీగా పంట వచ్చినప్పటికీ పంట రుణాలు రైతుల మెడకు గుదిబండగా ఉన్నాయి. చాలా చోట్ల ఆకాల వర్షాలు కూడా రైతులను దెబ్బతీశాయి.

ఇంతటి క్లిష్ట సమయంలో రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఇటీవలే నిరసన తెలిపారు. కేసీఆర్ ను విమర్శించారు. పంట రుణమాఫీ ఏమైందని.. రైతు బంధు ఏదని ప్రశ్నించారు. వెంటనే తేరుకున్న కేసీఆర్ తాజాగా పంట రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 1200 కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసింది. రూ.25వేల లోపు రుణాలన్నీ రైతుల రుణాలన్నీ దెబ్బకు మాఫీ అయిపోయాయి. కేసీఆర్ చర్యతో ఏకంగా తెలంగాణలో 5.5 లక్షల మంది రైతులు లబ్ధి కలుగనుంది.

ఇదేకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మరో వరం ప్రకటించింది. వ్యవసాయ ఇన్ పుట్ సబ్సిడీ కింద సుమారు 7000 కోట్ల రూపాయలను రైతుబంధు పథకంలో తాజాగా విడుదల చేసింది. దీని ద్వారా 57 లక్షలమంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ సంక్షోభ సమయంలో సీఎం కేసీఆర్ రైతులకు పెద్ద గిఫ్టులే ఇచ్చారని చెప్పవచ్చు. లాక్ డౌన్ తో కృంగిన వారికి భరోసా కల్పించారు. ఈ చర్యలతో ప్రతిపక్షాలకు సైతం చేతిలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయుధం లేకుండా పోయింది. ఈ దెబ్బకు ప్రతిపక్షాలకు కొద్దికాలం వరకు వేరే ఎజెండానే లేకుండా పోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News