కేసీఆర్ నే ఎదురించారు.. ఏం జరగబోతోంది?

Update: 2019-08-24 07:03 GMT
తెలంగాణలో దాదాపు 10వేల రెవెన్యూ గ్రామాలున్నాయి. గ్రామానికి ఒక వీఆర్వో ఉండాలి. కానీ ఉన్నది 5900మంది వీఆర్వోలు.. ఇక వీరికింద 22వేల మంది వీఆర్ఏలున్నారు. గడిచిన 8 నెలల కాలంలో ఏకంగా 25 మందికి పైగా వీఆర్వోలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇంత విచ్చలవిడి వీఆర్వోల అవినీతి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది. లంచావతారులుగా మారి కోట్లు కొల్లగొడుతున్న వీఆర్వోల వ్యవస్థనే తీసివేయాలని కేసీఆర్ పట్టుదలతో ముందుకెళ్తున్నారు. కానీ కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లేలా కలెక్టర్లు వ్యవహరించడం తెలంగాణ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా కలెక్టర్లతో కేసీఆర్ రెండు రోజుల సమీక్ష నిర్వహించారు. మీటింగ్ లోనే వివరాలేవీ బయటకు చెప్పవద్దని గోప్యత పాటించాలని కేసీఆర్ స్పష్టంగా సూచించారట.. అందుకే ఆలస్యంగా ఒక వార్త బయటకు వచ్చింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న కేసీఆర్.. వీఆర్వోలను సమూలంగా తొలగించాలని కలెక్టర్ల సదస్సులో ప్రతిపాదించారట.. వీఆర్వోలు అవసరమా అన్న కేసీఆర్ ప్రశ్నకు 90శాతం మంది కలెక్టర్లు అవసరమేనని కుండబద్దలు కొట్టడం విశేషం. గ్రామస్థాయిలో రెవెన్యూ, ఇతర ధ్రువీకరణకు వీఆర్వోలే కీలకమని.. వారు లేకపోతే పనులు జరగడం కష్టమని.. తమకు వారే కీలకమని అధికారులు చెప్పారట.. అవినీతి గురించి పట్టని కలెక్టర్లు తమ పనులు చక్కబెట్టుకునే ఉద్యోగిగానే వీఆర్వోలను చూడడం గమనార్హం.

కానీ కేసీఆర్ మాత్రం కలెక్టర్లకు చేదోడుగా ఉండే వీఆర్వోలలోని లంచావతారులను ఏరివేయడానికి రెడీ అయ్యాయి. అయితే కలెక్టర్లు మాత్రం వాళ్లు ఉండాల్సిందేనన్నారట.. ఒకరిద్దరు కలెక్టర్లు మాత్రమే వీఆర్వోలు వద్దంటూ కేసీఆర్ కు సపోర్టు చేశారట..

ఇలా కేసీఆర్ నిర్ణయానికే వ్యతిరేకంగా వ్యవహరించిన  కలెక్టర్లు తీరు చర్చనీయాంశంగా మారింది. వీఆర్వో వ్యవస్థను తీసివేయాలనుకుంటున్న కేసీఆర్ నిర్ణయానికి కలెక్టర్లు నో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News