నోముల అంత్యక్రియల వేళ.. కేసీఆర్ ఎంతలా ఎమోషనల్ అయ్యారో

Update: 2020-12-04 05:30 GMT
గుంభనంగా ఉన్నట్లు కనిపించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్నిసార్లు అనూహ్యంగా ఎమోషనల్ అవుతుంటారు.  తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. ఎంతో సన్నిహితులైతే తప్పించి.. ప్రముఖుల అంత్యక్రియలకు వెళ్లరు సీఎం కేసీఆర్. ఆయన వైఖరి కారణంగా చాలా సందర్భాల్లో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన తీరు మార్చుకోలేదు. తాజాగా.. పార్టీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత.. గతంలో కమ్యునిస్టునేతగా సుపరిచితుడు నోముల నర్సయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు గులాబీ అధినేత.

అనారోగ్యంతో మరణించిన నోముల నర్సయ్య అంత్యక్రియల్ని రెండు రోజులు వాయిదా వేశారు. దీనికి కారణంగా ఆయన చిన్న కుమార్తె అమెరికా నుంచి వచ్చే వరకు ఆపారు. బుధవారం రాత్రి  ఆమె రావటంతో.. గురువారం ఉదయం అంత్యక్రియల్ని నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమైంది. తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలెం స్మృతివనానికి చేరుకోవటానికి దాదాపు మూడు గంటల పాటు పట్టింది.

నోముల నర్సయ్య పాడెను మోసేందుకు పలువురునేతలు ముందుకు రావటం గమనార్హం. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వయంగా పాడెను మోశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గంధం చెక్కల్నిఉంచి.. నివాళులు అర్పించారు. అంత్యక్రియలకు హాజరు కావటానికి హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో వెళ్లారు.

షెడ్యూల్ ప్రకారం అరగంట పాటు మాత్రమే సీఎం కేసీఆర్ ఉండాలి. అందుకు భిన్నంగా ఆయన దాదాపు గంటన్నర పాటు ఉండిపోయారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నోముల కుటుంబ సభ్యుల రోదనలకు కేసీఆర్ కదిలిపోయారు. వారినిదగ్గరకు చేర్చుకొని.. ఓదార్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని మాట ఇచ్చారు. ఇటీవల కాలంలో కేసీఆర్ ఇంతలా కదిలిపోవటం ఇది రెండోసారిగా చెబుతున్నారు.
Tags:    

Similar News