మోడీకే కేసీఆర్ సలహాలు ఇచ్చారా? 2

Update: 2016-02-14 06:57 GMT
ఇక.. మోడీకి సలహాలు ఇచ్చినట్లుగా వచ్చిన కథనం చూసినప్పుడు.. ఈ విషయాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తన సన్నిహితుల ద్వారా ఉప్పందించారన్న భావన వ్యక్తమవుతోంది. ఎందుకంటే తన ఇమేజ్ ను ఎప్పుడు.. ఎలా పెంచుకోవాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. కేసీఆర్ ను దగ్గర నుంచి గమనించే వారికి ఈ విషయం చాలా బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తీరును ఇక్కడ ప్రస్తావించాలి. ఏదైనా ఇంగ్లిషు మీడియా సంస్థ.. మనకు పెద్దగా పరిచయం లేని మీడియా హౌస్ తరఫున ఎవరైనా ప్రతినిధులు ఆయన ఇంటర్వ్యూ అడిగితే.. వారి సర్క్యూలేషన్.. ప్రజల్లో వారి రీచ్ ఎంతన్న విషయాన్ని చూసుకొన్న తర్వాత మాత్రమే సమయం ఇచ్చేవారు. అది  కూడా... వారికి ఎంత సమయం అవసరమో ఆయనే నిర్ణయించుకునే వారు.

సాధారణంగా ఉద్యమ వేళ ఇంత లోతుగా ఆలోచించే వారు కాస్త తక్కువగా ఉంటారు. వచ్చిన అందరితోనూ మాట్లాడుతూ.. వీలైనంత ఇమేజ్ పెంచుకోవాలని చూసే విధానానికి కేసీఆర్ కాస్త భిన్నంగా వ్యవహరించేవారు.ఇలాంటి మైండ్ సెట్ ఉన్న కేసీఆర్.. మోడీ లాంటి నేతకు తానే సలహా ఇచ్చినట్లుగా వార్త అచ్చేయించుకోవటం చూసినప్పుడు అదేం కొత్త విషయంగా అనిపించదు. కేసీఆర్ తనకు తాను చెప్పి వార్త వేయించుకున్నారని చెప్పలేం. కాకపోతే.. ఏం చేస్తే అచ్చేస్తారో అన్న విషయం కేసీఆర్ కు తెలుసని చెప్పటమే ఇక్కడ ఉద్దేశం.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కథనం మొత్తం కేసీఆర్ కు అనుకూలంగా ఉండటం.. మోడీ పరపతిని కాస్త తగ్గించేలా ఉందని చెప్పకతప్పదు. రెండు మూడు నెలలకు కాస్త అటూఇటూగా రెండేళ్ల మోడీ పాలనలో ఇప్పటివరకూ ఏమీ జరగలేదన్న విషయాన్ని కేసీఆర్ తన ఒక్క మాటతో చెప్పేశారా? అంటే కాదనే చెప్పాలి. ఏం జరగలేదన్న విషయం కంటే.. ప్రజలు గుర్తుంచుకునేలా.. మోడీ అనే స్థాయిలో ఎలాంటి కార్యక్రమం జరగలేదని మాత్రమే కేసీఆర్ చెప్పటాన్ని మర్చిపోకూడదు.

మోడీ వరకూ ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా.. అదే సమయంలో కేసీఆర్ ఇమేజ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా ఉండటం గమనార్హం. ఇన్ని మాటలు కేసీఆర్ చెబుతుంటే.. మోడీ జస్ట్ వింటూనే ఉన్నారా? అన్న సందేహానికి కూడా సమాధానం ఇచ్చేస్తూ.. కేసీఆర్ చెబుతున్న విషయాల్ని జాగ్రత్తగా వింటూ.. నోట్ బుక్ లో రాసుకున్నట్లుగా పేర్కొనటం చూస్తే.. కేసీఆర్ మాటలకు మోడీ చాలానే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. పలుమార్లు ప్రయత్నించి పొందిన మోడీ అపాయింట్ మెంట్ కు సంబంధించి.. ఆయన భేటీ కేసీఆర్ ఇమేజ్ ను మరింత పెంచేలా ఉండటం గమనార్హం.
Tags:    

Similar News