కర్ణాటక ఒమిక్రాన్ పేషెంట్ జంప్.. ఇప్పుడెక్కడంటే?

Update: 2021-12-03 04:35 GMT
మొన్నటి వరకు సౌతాఫ్రికాకు మాత్రమే పరిమితమనుకున్న ఒమిక్రాన్ ఇప్పుడు భారత్ కు వచ్చేసింది. మూడు రోజుల క్రితం బెంగళూరుకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ ఉందన్న సందేహాలు వ్యక్తమవుతూ.. వారి శాంపిళ్లను పరీక్షల కోసం పంపిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా బయటపడిన రెండు ఒమిక్రాన్ కేసుల్లో ఒకరు దుబాయ్ కు వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. కొవిడ్ నెగిటివ్ ధ్రువపత్రంతో బెంగళూరుకు చేరుకున్న సదరు వ్యక్తి.. వారం తర్వాత (నవంబరు 27న) విమానంలో దుబాయ్ కు వెళ్లిపోయినట్లుగా గుర్తించారు.

66 ఏళ్ల సదరు వ్యక్తికి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లుగా బెంగళూరు అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన సదరు వ్యక్తి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారని.. అనంతరం హోటల్ కు వెళ్లారన్నారు. అదే రోజు కరోనా బారిన పడినట్లుగా గుర్తించినట్లుగా అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తి అస్వస్థతకు గురి కావటం.. కొవిడ్ లక్షణాలు ఎక్కువగా లేకపోవటంతో.. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతడిది అసింప్టమాటిక్ గా తేల్చారు.

దీంతో.. ఆయన్ను బయటకు రావొద్దని.. హోటల్ కే పరిమితం కావాలన్న సూచన చేశారు. బాధితుడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి రావటంతోఅతడి నుంచి నమూనాల్ని సేకరించిన అధికారులు.. జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.

అతడితో పాటు ప్రయాణించిన 24 మంది ప్రయాణికులు కరోనా నెగిటివ్ గా తేలగా.. సదరు వ్యక్తికి సెకండరీ కాంటాక్టు ఉన్న 240 మందిని కూడా పరీక్షించారు. వారికి కూడా కరోనా సోకలేదని తేల్చిన అధికారులు.. ఇంతా చేసి సదరు వ్యక్తి దుబాయ్ కు వెళ్లిపోవటం షాకింగ్ గా మారింది. నవంబరు 27న అర్థరాత్రి హోటల్ నుంచి బయటకు వచ్చి కారులో ఎయిర్ పోర్టుకు వెళ్లి దుబాయ్ కు వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. ఈ ఉదంతం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.
Tags:    

Similar News