నాడు చిరంజీవికి.. నేడు పవన్ కు మద్దతు

Update: 2018-10-14 05:21 GMT
ఏపీ రాజకీయ ముఖచిత్రం పై కొత్త పొత్తులు చిగురిస్తున్నాయి. సామాజిక వర్గాల కలబోత సాధ్యమవుతోంది. వివిధ సామాజిక వర్గాల వారీగా ప్రజలు, నాయకులు చీలిపోతున్నారు. మెగస్టార్ చిరంజీవి పార్టీ స్థాపించినప్పుడు అండగా ఉన్న కాపు సామాజిక వర్గం తాజాగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

తాజాగా ఏపీ రాష్ట్ర కాపు జేఏసీ సమావేశమైంది. మెజారిటీ కాపు జేఏసీ నేతలు వారి సామాజికవర్గ నేత అయిన పవన్ కు మద్దతు ఇద్దామని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. దీనికి ముద్రగడ సానుకూలంగా స్పందించినట్టు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీ రాజకీయ ముఖచిత్రంలో తెలుగు దేశం పార్టీకి కమ్మ సామాజికవర్గం బలమైన మద్దతుగా నిలుస్తోందని.. అలానే రెడ్డి సామాజికవర్గం వైసీపీ వైపు నిలబడిందని.. అందుకే కాపులంతా జనసేనకు సపోర్ట్ చేయాలనే ఆలోచనలో కాపు నేతలున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ స్థాపించిన జనసేనను తమ సొంత పార్టీలాగా భావించాలని కాపు నేతలంతా అభిప్రాయపడ్డట్టు తెలిసింది.  ఈ మేరకు కాకినాడలో జరిగిన కాపు జేఏసీ సమావేశంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన నేతలంతా మద్దతిచ్చే విషయంలో సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

బీసీ రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ సహా కాపునేతలంతా నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని చూస్తున్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్న దృష్టా కాపు జేఏసీ జనసేన వైపు నిలబడడం ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాపులకు చంద్రబాబు చేసిన మోసం దృష్ట్యా ఆ పార్టీని ఓడించాలని కాపులంతా కంకణం కట్టుకుని ఉన్నారని అర్థమవుతోంది.

కాకినాడలో ఇటీవలే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన జరిగిన సమావేశంలో  కాపులను బీసీ-ఎఫ్ కేటగిరిలో గుర్తించాలని.. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సైతం బీసీ-ఎఫ్ సర్టిఫికెట్లను తహసీల్దార్ కార్యాలయాల ద్వారా మంజూరు చేయాలని సమావేశం తీర్మానించింది.

ఇక ఏపీ రాజకీయాల్లోనే తూర్పు గోదావరి జిల్లా అత్యంత కీలకం.. ఇక్కడ మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాపు జేఏసీ సత్తా ఇక్కడ చాటాలని ముద్రగడ భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున సీట్లు కేటాయిస్తే వారిని గెలిపించేలా జేఏసీ వ్యూహం రచిస్తుందని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు పవన్ తో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. ముద్రగడ గతంలో పోటీచేసిన ప్రత్తిపాడు, కొత్తపేట, కాకినాడ రూరల్ సీట్లను కాపు జేఏసీ కీలక నేతలకు కేటాయించాల్సిందిగా జనసేనాని పవన్ కు ముద్రగడ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న సీట్లను కూడా జేఏసీకి కేటాయించాలని పవన్ ను కోరినట్టు తెలిసింది.
Tags:    

Similar News