ఏపీకి రావాల్సిన నిధుల లెక్క రెడీ చేసిన జ‌గ‌న్‌

Update: 2019-06-09 06:36 GMT
ప‌ట్టుమ‌ని ప‌ది రోజులుగా కూడా కాకుండానే పాల‌న మీద ప‌ట్టు ప్ర‌ద‌ర్శించ‌ట‌మే కాదు.. అంద‌రి చూపులు త‌న మీద ప‌డేలా చేస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఓవైపు పాల‌నా ప‌ర‌మైన నిర్ణ‌యాల్ని వ‌రుస పెట్టి చూస్తున్న ఆయ‌న‌.. మ‌రోవైపు ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన బ‌కాయిల చిట్టాను సిద్ధం చేయించారు. కేంద్రంతో ఘ‌ర్ష‌ణ ప‌డ‌కుండా స్నేహంతో సాధించాల‌ని భావిస్తున్న జ‌గ‌న్.. అందులో భాగంగా  ఈ రోజు తిరుమ‌లకు వ‌స్తున్న ప్ర‌ధాని మోడీకి ఇచ్చేందుకు ఒక విన‌తిప‌త్రాన్నిసిద్ధం చేశారు.

ఇందులో విభ‌జ‌న హామీలు కింద ఏపీకి రావాల్సిన లెక్క‌ల్ని ఆయ‌న‌కు ఇవ్వ‌నున్నారు. తీవ్ర‌మైన ఆర్థిక లోటుతో ఇబ్బంది ప‌డుతున్న ఏపీకి కేంద్ర‌ద‌న్ను ఇప్పుడు అత్య‌వ‌స‌రం. బ‌కాయిల మీద ఆశ‌లు పెట్టుకున్న జ‌గ‌న్‌.. అందుకు త‌గ్గ‌ట్లే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల లెక్క‌ను తేల్చారు.

జ‌గ‌న్ తాజాగా సిద్ధం చేసిన నివేదిక ప్ర‌కారం కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన మొత్తం రూ.74,169 కోట్లుగా తేలింది. చ‌ట్ట ప్రకారం ఏపీకి రావాల్సిన నిధుల్ని ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోడీని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కోర‌నున్నారు.

కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన బ‌కాయిల చిట్టా చూస్తే..

+   2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది.  2014-15 ఆర్థిక సంవత్సరంలోని 10 నెలల రెవెన్యూలోటు రూ.16,078 కోట్లు.  కాగా కేంద్రం నుంచి ఇప్పటి వరకూ రూ.3979 కోట్లు వచ్చాయి. వేస్‌ అండ్‌ మీన్స్‌ సందిగ్ధత వల్ల రూ.6,870 కోట్ల ఖర్చును ఆ ఆర్థిక సంవత్సర రెవెన్యూలోటులో చూపలేకపోయారు. ఇవి రెండూ కలిపితే రెవెన్యూలోటు రూ.22,948 కోట్లకు చేరుకుంటుంది.

+  2014-15 ఆర్థిక సంవత్సర రెవెన్యూలోటులో రూ.16,078 కోట్లలో రూ.4,117 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందులో రూ.3979 కోట్లు ఇవ్వగా - ఇంకా రూ.138.39 కోట్లు రావాల్సి ఉంది. వేస్‌ అండ్‌ మీన్స్‌ సందిగ్ధత వల్ల రెవెన్యూలోటులో చేర్చని రూ.6870 కోట్లలో పీఆర్సీ ఎరియర్స్‌ రూ.3,920 కోట్లు - బిల్లులు రూ.2,950 కోట్లు ఉన్నాయి. మొత్తం రెవెన్యూలోటు రూ.22,948 కోట్లలో ఇప్పటి వరకూ రూ.3979 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది.

+  విభజన చట్టంలోని పన్నులకు సంబంధించిన సెక్షన్‌ 50, సెక్షన్‌ 51లను సవరిస్తే ఏపీకి అదనంగా రూ.3,820 కోట్లు వస్తాయి. ఈ సెక్షన్లను సవరించి ఏపీకి న్యాయం చేయాలి.

+   ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి రూ.350 కోట్లు ఇస్తున్నారు. గత ఐదేళ్లలో మూడేళ్లు ఈ నిధులు సక్రమంగానే ఇచ్చారు. నాలుగో ఏడాది రూ.350 కోట్లను ఏపీ ఖాతాలో వేసి వెనక్కి తీసుకున్నారు. ఐదో ఏడాది అసలు ఇవ్వలేదు. నాలుగో ఏడాది వెనక్కి తీసుకున్న నిధులను విడుదల చేయాలని నీతిఆయోగ్‌ కూడా కోరినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకూ ఆ నిధులు విడుదల చేయలేదు. వాటిని తక్షణమే విడుదల చేయాలి.

+   ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ ఇవ్వాలి.  ఇందుకు గాను రూ.23,300 కోట్లు విడుదల చేయాలి.
Tags:    

Similar News