జగన్ ఆయువుపట్టునే పట్టుకోబోతున్నారా?

Update: 2019-12-16 11:07 GMT
ఒక వ్యవస్థ నడవాలంటే నడిపించే నాయకుడు సరైనోడు అయితేనే సరిపోదు.. ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే కిందిస్థాయి సిబ్బంది సహకారం బోలెడు అవసరం.. ఏపీలో విప్లవాత్మక నిర్మాణాలతో ముందుకెళ్తున్న సీఎం జగన్ ఇప్పుడీ విషయాన్ని గుర్తెరిగి మరో సంచలనానికి నాంది పలుకుతున్నారు. నాయకుడిగా తన నిర్ణయాలను అమలు చేసే అధికారగణాన్ని మచ్చిక చేసుకునేపనిలో పడ్డారు. వారి ద్వారానే ఏపీ దశా దిశను మార్చేందుకు తాజాగా ఏపీలోని కీలక అధికారులతో విందును ఏర్పాటు చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్ గద్దెనెక్కిన తర్వాత పరిపాలనను గాడిలో పెడుతున్నారు. ఇందుకు అధికారుల సహకారం ఎంతో అవసరం.. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తొలగింపుతో అధికార వర్గాల్లో అసంతృప్తి రాజ్యమేలుతోందన్న ప్రచారం ఎక్కువైంది.   అధికార వర్గాలు ఖిన్నుగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో చక్కని సమన్వయం కోసం జగన్ కొత్త ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు సీఎం జగన్ త్వరలోనే ‘రచ్చబండ’కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే దీన్ని విజయవంతం చేసేందుకు అధికారుల సహకారం అవసరం. అంతేకాకుండా జగన్ అద్భుతమైన పథకాలు ప్రజలకు చేరువ అయ్యేందుకు అధికారుల తోడ్పాటు అవసరం. అందుకే మంగళవారం సాయంత్రం అసెంబ్లీ సమావేశాలు ముగియగానే రాష్ట్రంలో కీలక స్థానాలలో ఉన్న అధికారులతో ప్రత్యేక భేటికి జగన్ రెడీ అయ్యారు. వైసీపీ సర్కారుకు, అధికారులకు మధ్యనున్న పొరపొచ్చాలను పూర్తిగా తొలగించేందుకు రెడీ అయ్యారు.

ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ లతోపాటు జేసీ, అడిషనల్ ఎస్పీల స్థాయి నుంచి సచివాలయంలోని సీనియర్ ప్రిన్సిపల్ సెక్రెటరీల దాకా ఈ విందుకు హాజరుకావాలని సీఎంవో వర్తమానాలు పంపింది.

ఇక సీఎం జగనే తమతో విందుకు సిద్ధం అవ్వడంతో పరిపాలనలో కొత్త విధానాలపై పలువురు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని తెలిసింది. సీఎం జగన్ ప్రతి ఒక్కరితో మాట్లాడేలా ఈ విందు భేటి పెట్టుకున్నారట.. మరి జగన్ ఏం చెప్పబోతున్నారు? అధికారులు ఏమేం పంచుకుంటారు? ఈ విందు భేటిలో ఏలాంటి సంచలనాలు నమోదవుతాయన్నది వేచిచూడాలి
Tags:    

Similar News