బాబు పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పిన జగన్

Update: 2016-02-14 04:51 GMT
జగన్ నోట నాన్న జపం ఎక్కువైంది. తనకు తానుగా ప్రభావం చూపించలేనన్నవిషయం అర్థమయ్యాక.. తన అమ్ములపొదిలో ఉన్న నాన్న వైఎస్ అస్త్రాన్ని తీసిన జగన్.. జనం మీద ప్రయోగించారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలనను చూసిన వాళ్లంతా.. దివంగత నేత వైఎస్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నారని.. సీఎం అంటే ఎలా ఉండాలో వైఎస్ చెప్పారంటూ జగన్ ధ్వజమెత్తారు. శనివారం శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్ని సందర్శించిన ఆయన.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో చెబుతానన్న జగన్.. సమాధానంగా ‘‘మోసం.. మోసం.. మోసం’’ అంటూ తేల్చేశారు. ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాలకు చంద్రబాబు హామీలు ఇచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. బాబు మోసాలంటూ జగన్ చేసిన విమర్శలు చూస్తే..

‘‘ఎన్నికల సమయంలో అందరికి ఇళ్లు అన్నారు. ఇప్పుడు అడిగితే లేవంటున్నారు. ఇంత మోసపూరిత పాలన ఎప్పుడూ చూడలేదు’’

‘‘ఎన్నికల ముందు రుణాల్ని బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పారు. బ్యాంకులో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. ఇప్పుడేమో బ్యాంకుల నుంచి నోటీసులు అందుకుంటున్నాం’’

‘‘డ్వాక్రా అక్కచెల్లెమ్మల్ని అడిగితే.. గతంలో పావలా వడ్డీకే రుణాలు దొరికేవి. ఇప్పుడు బ్యాంకులకు రూ.2 వడ్డీ కట్టాల్సి వస్తోంది’’

‘‘బాబొస్తే జాబొస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. చంద్రబాబు లాంటి మోసగాడు ఈ దేశంలోనే లేడు’’

‘‘ఎన్నికల ముందు ఏ టీవీ చూసినా.. పత్రికల్లో చూసినా మోసపూరిత ప్రకటనలిచ్చి.. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టారు. అందుకే ఇప్పటికి వైఎస్ పాలనను మర్చిపోలేకపోతున్నామని ప్రజలు చెబుతున్నారు’’
Tags:    

Similar News