జగన్ భాష్యం : పాట పాతదే కానీ డ్యాన్సు కొత్తది!

Update: 2018-03-11 05:29 GMT
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు కొత్త పోరాటాన్ని ప్రారంభించారు. ఇప్పటికైనా ఆయన పోరాటాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసింది అనే ప్రచారం చేయడమే తప్ప.. ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందే.. అనే నినాదంతో.. రాష్ట్రవ్యాప్త చైతన్యం  తీసుకురావాల్సిందిగా ఆయన పార్టీ శ్రేణులకు నూరిపోయలేకపోతున్నారు. అందుకే చంద్రబాబునాయుడు పోరాటం అనేది ఫక్తు రాజకీయ అజెండా తో జరుగుతున్న కుట్రలాగా కనిపిస్తున్నది తప్ప.. రాష్ట్రం కోసం తపనతో చేస్తున్న పోరాటం లాగా లేదని ప్రజలు అనుకుంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బాబు బూటకాన్ని చాలా చక్కగా బయటపెడ్తున్నారు. ప్రజల్లో వాస్తవిక అవగాహనను కలిగిస్తున్నారు. ఆయన చీరాల సభలో చెప్పిన విశ్లేషణ అందరూ కూడా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్న సంగతి అని తెలుసుకోవాలి.

ఇంతకూ జగన్ ఏం అన్నారంటే.. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా కేంద్రాన్ని, భాజపాను, మోడీని, జైట్లీని తిడుతూ పోరాడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. బాగానే ఉంది గానీ.. అరుణ్ జైట్లీ ఇదివరకు చెప్పిన మాటలకు ఇప్పుడు చెప్పిన మాటలకు తేడా ఏం ఉంది. ఇన్నాళ్లుగా ఆయన ఏం చెబుతూ వచ్చారో.. ఇప్పుడు కూడా అదే చెప్పారు. మరి ఇన్నాళ్లూ అవే మాటలను అద్బుతాలుగా ప్రచారం  చేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు మాత్రం.. అవే మాటలను రాష్ట్రానికి చేస్తున్న ద్రోహంగా ఎలా అభివర్ణించగలరు.

అసలు కేంద్రం మోసం చేసిందని అనే హక్కు చంద్రబాబుకు ఎక్కడుంది? ఇన్నాళ్లూ వారి పంచలో ఉండి వారు ఆడమన్నట్లు డ్యాన్సులు ఆడింది నారా చంద్రబాబునాయుడే కదా! జైట్లీ ఇప్పుడ కూడా పాత పాటే పాడుతున్నాడు.. చంద్రబాబు మాత్రం కొత్త డ్యాన్సు ఆడుతున్నాడు.. అంటూ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఈ మాటలు విన్న ఎవరికైనా సరే నిజమే కదా అనిపిస్తుంది. జైట్లీ మాటల్లో వంచన లేదని మన ఉద్దేశం కాదు. కానీ, ఇదే వంచన కొన్నేళ్లుగా సాగుతున్నది.. ఆ వంచనకు భజన చేసి... చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని వంచిస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం.. పాపానికి సకల బాధ్యులుగా భాజపాను నిందించే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News