రైతు ఉద్యమానికి రక్షణగా ఐటీ ఇంజినీర్లు

Update: 2020-12-15 05:43 GMT
మోడీ సర్కరు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని శివారులో సాగుతున్నఈ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా దన్ను లభిస్తోంది. పలు రంగాల వారు స్వచ్ఛందంగా తమ మద్దతు ఇస్తున్నారు. ఇలాంటివేళ.. ఈ ఉద్యమంపై విషం చిమ్మేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలకు చెక్ చెప్పేందుకు ఐటీ ఇంజీనర్లు ఎవరికి వారుగా రంగంలోకి దిగుతున్నారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారానికి చెక్ చెప్పటంతో పాటు.. ఫేక్ వార్తల్ని నిరోధించటానికి విదేశాల్లో ఉన్న పలువురు ఐటీ ఇంజనీర్లు ఎవరికి వారుగా రంగంలోకి దిగుతున్నారు. దేశంలోని వారు కూడా తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో ఐటీ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్న పంజాబ్ కు చెందిన భవ్ జిత్ సింగ్ ఇటీవల సెలవుపై ఇండియాకు వచ్చారు. ఇక్కడ జరుగుతున్నది చూసిన ఆ యువకుడు.. సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న నకిలీ వార్తల్ని గుర్తించాడు. వెంటనే.. ట్రాక్టర్ టు ట్విటర్ అనే ట్విటర్ హ్యాండిల్ ను రూపొందించారు. రైతుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్టు చేస్తున్నారు. తాను చేసిన పోస్టుల్ని నవంబరు 28 నుంచి ఇప్పటివరకు పాతికలక్షల మంది చూసినట్లు చెబుతున్నారు.

రైతుల ఉద్యమానికి చెందిన వార్తలు.. ఫోటోలు.. వీడియోలు పలు భాషల్లో పోస్టు చేస్తున్నారు. అతని స్నేహితులు కూడా ఇప్పుడు అతనికి సాయంగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో రైతు ఉద్యమాన్ని డ్యామేజ్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెప్పాలన్నదే వారి ప్రయత్నం. ఇలా ఎవరికి వారు..తమ వంతు సాయాన్ని అందించేందుకు సిద్ధం కావటంతో రైతు ఉద్యమం అంతకంతకూ బలోపేతం అవుతుందని చెప్పాలి.
Tags:    

Similar News