వైసీపీ `పార్ల‌మెంటు` అజెండా ఇదేనా?

Update: 2021-07-15 15:10 GMT
ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఏయే అంశాలు ప్ర‌స్తావించాలి?  వేటిని ప్ర‌ధానంగా రాబ‌ట్టుకోవాలి? అనే అంశాల‌పై ఏపీ అధికార పార్టీ వైసీపీ ఒక అజెండా సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.  పార్టీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుపై అన‌ర్హ‌త వేటు వేయించ‌డ‌మే ప్ర‌ధాన అజెండాగా క‌నిపిస్తోంది. పార్టీ వాయిస్ వినిపించాల్సిన ర‌ఘురామ‌.. త‌న వ్య‌క్తిగ‌త అజెండాను, టీడీపీ అజెండాను అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే.. అన‌ర్హ‌త పిటిష‌న్‌కు ఏడాది స‌మ‌యం గ‌డిచినా.. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై  క్లారిటీ రాలేదు. దీంతో ఇప్పుడు పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ అంశంపై ఒత్తిడి పెంచాల‌ని ప్ర‌ధాన అజెండాగా నిర్ణ‌యించుకున్నారు.  ఈ క్ర‌మంలో వైసీపీ ఎంపీలు.. స్పీక‌ర్‌ను క‌లిసి.. ర‌ఘురామ అన‌ర్హ‌త‌పై ఒత్తిడి పెంచే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో నిర‌స‌న వ్య‌క్తం చేసే అవ‌కాశం కూడా ఉంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే మ‌రోసారి ఈవిష‌యంపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పీక‌ర్‌కు తాజాగా రిప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

ఇక‌, ర‌ఘురామ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. వైసీపీ అజెండాలో విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాడాల‌నేది మ‌రో కీల‌క నిర్ణ‌యం. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న దిశ చ‌ట్టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇప్పించుకునేలా పార్ల‌మెంటు వేదిక‌గా వైసీపీ ఎంపీలు గ‌ళం వినిపించ‌నున్నారు. ఇక‌, రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదంగా ఉన్న కృష్ణా జ‌లాల‌పై కూడా వైసీపీ ఎంపీలు గ‌ళం వినిపించే అవ‌కాశం ఉంది. కృష్ణారివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు ప‌రిధుల‌ను నిర్ణ‌యించేలా కూడా ఎంపీలు.. ఒత్తిడి తేవాల‌ని నిర్న‌యించిన‌ట్టు తెలిసింది.

ఇక‌, విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యానికి వ‌స్తే.. దీనిని ప్రైవేటీక‌రించే ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన విష‌యం తెలిసిందే.  దీనిపై ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్... ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి రెండు సార్లు లేఖ‌లు కూడా స‌మ‌ర్పించారు.  ఈ క్ర‌మంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా.. వైసీపీ ఎంపీలు గ‌ళం వినిపించే అవ‌కాశం ఉంది.  తాజాగా తాడేప‌ల్లి కేంద్రంగా జ‌రిగిన వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స‌భ‌ల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే అంశంపై చ‌ర్చించారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో అజెండా రెడీ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News