రాంమాధవ్ ఔట్ వెనుకున్న అసలు కారణం ఇదేనా?

Update: 2020-09-27 17:30 GMT
కీలక స్థానాల్లో ఉన్న వారి పదవుల్లో మార్పులు చోటు చేసుకున్నాయంటే అందుకు రెండే కారణాలు ఉంటాయి. అయితే.. ప్రమోషన్ అయినా అయి ఉండాలి. లేదంటే డిమోషన్. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గానికి సంబంధించి చేసిన మార్పులు చేర్పులు ఆసక్తికరంగా మారాయి. పార్టీలో ఇప్పటివరకు కీలక స్థానంలో ఉన్న కొందరు నేతల్ని హటాత్తుగా మార్చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.

పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నేతలుగా చెప్పే తెలుగు ప్రాంతాలకు చెందిన ఇద్దరు నేతలకు స్థానచలనం కలిగించటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. బీజేపీ జాతీయస్థాయిలో చక్రం తిప్పుతారని పేరున్న రాంమాధవ్.. పి.మురళీధర్ రావుల స్థానంలో కొత్తవారికి చోటు దక్కింది. మోడీషాలకు అత్యంత సన్నిహితుడిగా చెప్పే రాంమాధవ్ ను పదవి నుంచి తప్పించటం ఆసక్తికరంగా మారింది. అయితే.. అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు.

బిహార్ ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా రాంమాధవ్ కు కేంద్రమంత్రి పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన్ను పార్టీ పదవి నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాంమాధవ్ ను కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కర్ణాటక సీఎం యడియూరప్ప నుంచి స్పష్టమైన హామీ ఉందని చెబుతున్నారు.

రాజ్యసభకు ఎంపికైన ఆయనకు.. కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ఆయనకు కేంద్రంలో పదవిని ఇవ్వటం ద్వారా తెలంగాణకు తామిస్తున్న ప్రాధాన్యతను మోడీషాలు చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. అదే సమయంలో.. 2023 నాటికి తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు వీలుగా రాంమాధవ్ ను మరింత పవర్ ఫుల్ గా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనలో నిజమెంతన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
Tags:    

Similar News