కరోనా టీకా కూడా మోసమేనా ?

Update: 2021-02-21 03:30 GMT
మోసగాళ్ళకు అది ఇది అని ఏమీ లేదు. మోసపోయేవాళ్ళునంత కాలం మోసం చేసే వాళ్ళకు కొదవే లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పడీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏదో బ్రిటన్, ఇండియా, అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సినేషన్ తయారైనా అది ప్రపంచ జనాభాకు ఏమాత్రం సరిపోవటం లేదు. ఇదే అదునుగా వ్యాక్సినేషన్లో కూడా మోసపూరితమైన టీకాలు మార్కెట్లోకి వచ్చేశాయి.

ప్రపంచంలోని జనాభా అంతా వ్యాక్సినేషన్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దీన్నే అదునుగా మెక్సికోలో కొందరు మోసగాళ్ళు నకిలీ వ్యాక్సినేషన్ను ఇచ్చేస్తున్నారు. పైగా ఒక్కో డోసుకు సుమారు  రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. విషయం తెలీని చాలామంది భారీ మొత్తాలు చెల్లించి తాము కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సినేషన్ వేయించుకున్నట్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.

అయితే వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం ఆనోటా ఈనోటా పోలీసులకు తెలియటంతో ఆశ్చర్యపోయారు. దాంతో విషయం ఏమిటని టీకాలు వేస్తున్న చోటకి వెళి విచారణ జరిపారు. దాంతో అసలు విషయం బయటపడింది. అమెరికాలో తయారైన ఫైజర్ టీకాను వేస్తున్నట్లు ఉత్తర మెక్సికోలోని మాన్ టెర్రీ ప్రాంతంలోని ఓ క్లినిక్ లో కొందరు డాక్టర్లు ప్రజలకు చెప్పారట. దాంతో ఆర్ధికస్తోమత ఉన్న వాళ్ళంతా పోలోమంటూ వ్యాక్సినేషన్ కోసం ఎగబడ్డారు.

టీకాలు వేస్తున్న క్లినిక్ పై పోలీసులు అకాస్మత్తుగా దాడి జరిపినపుడు అక్కడున్న సిబ్బంది తప్పించుకునేందుకు ప్రయత్నించారట. దాంతో పోలీసులు అందరినీ అదుపులోకి తసుకున్నారు. దాంతో వాళ్ళు వేస్తున్నదంతా నకిలీ టీకాలే అని అర్ధమైపోయింది. అయితే అప్పటికే చాలామంది నుండి పెద్ద ఎత్తున సొమ్మును వసూలు చేసేశారు మోసగాళ్ళు. మొత్తానికి జనాల అవసరాన్ని ఆసరా చేసుకుని మోసగాళ్ళు చివరకు కరోనా వైరస్ ను కూడా విడిచిపెట్టలేదు.
Tags:    

Similar News