బండిని మించిపోతున్నారా ?

Update: 2023-06-10 09:58 GMT
హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ ను బీజేపీ పెద్దలు బాగా ప్రొజెక్ట్ చేస్తున్నట్లున్నారు. కీలకమైన ఎలక్షన్ క్యాంపెయిన్  కమిటి  ఛైర్మన్ గా నియమించినట్లు పార్టీవర్గాల టాక్. ఇదే విషయాన్ని తొందరలోనే అగ్రనేతలు ప్రకటించబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే చేరికల కమిటికి ఛైర్మన్ గా ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే వివిధ కారణాల వల్ల ఇతర పార్టీల నుండి బీజేపీలోకి చెప్పుకోతగ్గ నేతలు చేరలేదు. ఈ విషయంలో ఈటల విఫలమైనట్లు పార్టీలోనే బాగా ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీ పెద్దల ఆదేశం ప్రకారం ఈటల ఢిల్లీకి వెళ్ళారు. మరి ఎంఎల్ఏతో ఏమి మాట్లాడుదామని పెద్దలు పిలిపించారో తెలీదు. ఎంఎల్ఏ+చేరికల కమిటి ఛైర్మన్+ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటి ఛైర్మన్ అంటే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కన్నా ఈటల బాగా పవర్ ఫుల్ అయిపోతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఢిల్లీ పెద్దలు ఈటలను ఇంతగా ప్రమోట్ చేస్తున్నారంటే రాబోయే ఎన్నికల్లో అవసరమైతే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే ఉద్దేశ్యంలో ఉన్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తెలంగాణాలో బీసీ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. బీసీ నేతే అయిన ఈటల ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రొజెక్ట్ చేయటం వల్ల బీసీల ఓట్లు పడి పార్టీ లాభపడుతుందనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ విషయం ఏమిటంటే బండికి ఈటలకు ఏమాత్రం పడటంలేదు. పార్టీలో ఈటలకు లభిస్తున్న ప్రాధాన్యత కారణంగా బండిలో అభద్రత పెరిగిపోతున్నట్లుంది. మొన్నటివరకు పార్టీలో బండి చెప్పిందే వేదం, బండి మాట్లాడిందే ఫైనల్.

బీఆర్ఎస్ నుండి ఈటల బీజేపీలో చేరటమే కాకుండా ఉపఎన్నికలో గెలవటంతో ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగిపోయింది. పైగా బీసీ నేత కూడా కావటంతో ఢిల్లీ పెద్దల దృష్టిలో పడ్డారు. ఇదే సమయంలో బండి అంటే పడని సీరియర్లలో కొందరు ఈటల దగ్గర చేరారు.

దాంతో బండి వ్యతిరేకత వర్గం పార్టీలో పెరిగిపోతోంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో పెరిగిపోతున్న ప్రాధాన్యత దృష్ట్యా ఈటలనే పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినా ఆశ్చర్యపోవక్కర్లేదనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Similar News