ఆస్ట్రేలియాలోనూ మనోడ్ని కొట్టారు

Update: 2017-03-27 05:21 GMT
రోజులు గడుస్తున్న కొద్దీ విద్వేషం అంతకంతకూ పెరుగుతోంది. ట్రంప్ చేతికి అధికారం వచ్చిన నాటి నుంచి అమెరికాలో పరిస్థితులు ఎంతలా తయారయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. విద్వేషపు మాటలు.. దాడుల్ని దాటేసి.. హత్యలు సైతం చేసేస్తున్నారు. తాజాగా అలాంటి విద్వేషం ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న వైనం కలకలంరేపుతోంది.

వారం వ్యవధిలో చోటు చేసుకున్న రెండు ఘటనలు చూస్తే.. ఆస్ట్రేలియాలో మారుతున్న పరిస్థితులకు నిదర్శనంగా చెప్పొచ్చు. తాజాగా జరిగిన దాడి ఉదంతంలోకి వెళితే.. నర్సింగ్ కోర్సు చేస్తున్న కేరళ యువకుడు 33 ఏళ్ల లి మాక్స్ జాయ్ ఖాళీ వేళల్లో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. మెక్ డోనాల్డ్స్ లో కాఫీ తాగేందుకు నార్త్ హోబర్డ్ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ ముగ్గురు యువకులు, ఒక యువతి అత‌డిపై దాడి చేశారు.

దేశం పేరుతో దూషిస్తూ విప‌రీతంగా కొట్టారు.  వెంట‌నే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే.. అప్పటేకే దాడికి పాల్పడిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.  గాయాలై.. రక్తం ఓడుతున్న జాయ్ ను ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించిన తర్వాత ఇంటికి పంపారు. ఇటీవల కాలంలో తన లాంటి కారు డ్రైవర్లు పలువురు అవమానాలకు గురి అవుతున్నట్లు జాయ్‌ చెప్పారు. దాడి ఉదంతాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లుగా కేరళలో ని కొట్టాయం ఎంపీ జాన్ కె మణి వెల్లడించారు. విద్వేషపు దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవటం ద్వారా.. ఈ తరహా దాడులకు చెక్ చెప్పే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News