చైనా వ‌క్ర‌బుద్ధి: తీవ్రంగా బ‌దులిచ్చిన భార‌త్‌

Update: 2020-04-11 18:30 GMT
ప్ర‌స్తుతం కరోనా వైరస్ వ‌ణికిస్తుండ‌గా ప్ర‌పంచ‌మంతా తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితుల్లో ఉంది. క‌రోనా వైర‌స్‌కు పురుడుపోసిన చైనా తీవ్రంగా న‌ష్ట‌పోయిన విష‌యం తెలిసిందే. అలాంటి చైనా ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ త‌న వ‌క్ర‌బుద్ధిని చాటుతూనే ఉంది. ఆ దేశం ప్ర‌పంచంలో ఏం జ‌రుగుతున్నా త‌న పంథాను మాత్రం మార్చుకోవ‌డం లేదు. తాజాగా ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) అజెండాలో భార‌త్‌లోని కశ్మీర్ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చైనా ప్రతిపాదించింది. చైనా చేసిన ప‌నికి భారత‌దేశం ఖండించింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. జమ్మూకాశ్మీర్ అంశం ఎప్పటికీ కూడా త‌మ అంతర్గత అంశ‌మ‌ని మరోసారి భార‌త్ స్పష్టం చేసింది. చైనా తీరుపై భార‌త‌దేశంలో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఐరాసలో చైనా శాశ్వత ప్రతినిధి జమ్మూకాశ్మీర్ గురించి ప్రస్తావించడాన్ని తిరస్కరించిన‌ట్లు భార‌త విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది. కశ్మీర్ అంశంపై భారత్ వైఖరి ఏంటో చైనాకు బాగా తెలుసు.. ఇప్పటికీ, ఎప్పటికీ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ భార‌త్‌లోని అంతర్భాగమేన‌ని స్ప‌ష్టం చేసింది. జ‌మ్మూక‌శ్మీర్‌కు సంబంధించిన సమస్యలు కూడా భారతదేశానికి అంతర్గతమైనవేనని భార‌త విదేశాంగ శాక తెలిపింది. ఇప్పటికైనా చైనాతో సహా ఇతర దేశాలు భారతదేశ అంతర్గత వ్యవహారాలను వ‌దిలేయాల‌ని ఈ సంద‌ర్భంగా చైనాతో పాటు మిగ‌తా దేశాల‌కు ప‌రోక్షంగా సూచించింది.

జమ్మూకాశ్మీర్ అంశంపై ఇప్పటికీ భారత్ పాకిస్తాన్‌తో చర్చలు జరుగుతున్నాయ‌ని, ఈ విషయంపై మున్ముందు చర్చించడానికి పాక్ భారత్‌పై ఉగ్రవాద చర్యలను నిలిపివేయాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్తాన్ మాత్రం జమ్మూకశ్మీర్ అంశం వివాదంలో ఉందని, భార‌త్‌ను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాద గ్రూపులకు తాము మద్దతు ఇవ్వడం లేదని స్ప‌ష్టం చేసింది.

ప్రపంచం మొత్తం క‌రోనాతో స‌త‌మ‌త‌మ‌వుతుంటే ఇప్పటివరకు ఐక్య‌రాజ్య‌స‌మితిలో క‌రోనా వైర‌స్‌పై చ‌ర్చించ‌క‌పోవ‌డం ఇత‌ర  సభ్యదేశాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఐరాస భద్రతా మండలిలో కరోనా వైరస్‌పై చర్చ జరగాల‌ని ప‌లు దేశాలు కోరుతున్నాయి. అయితే దీనిపై చైనాకు ఏమాత్రం ఇష్టం లేదని.. ఒకవేళ చ‌ర్చ జరిగితే క‌రోనా వైర‌స్‌పై సంచలన విష‌యాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఆ చైనా భ‌ద్ర‌తా మండ‌లి లో క‌రోనా వైర‌స్‌ పై చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని అంత‌ర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో క‌శ్మీర్ అంశం లేవ‌నెత్త‌డం స‌రికాద‌ని ఇత‌ర దేశాలు కూడా భావిస్తున్నాయి. మ‌రి చైనా చేసిన ప్ర‌తిపాద‌న‌పై ఐక్య‌రాజ్య స‌మితి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి.
Tags:    

Similar News