సుధామూర్తి చెప్పిన అమెరికా అవమానం\ గౌరవం కథ

ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త.. రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి ఇటీవల పార్లమెంటులో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.;

Update: 2026-02-19 07:29 GMT

ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త.. రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి ఇటీవల పార్లమెంటులో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా దశాబ్దాల క్రితం అమెరికాలోని బోస్టన్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఆమె ఎదుర్కొన్న "అవమానకర" పరిస్థితి, ప్రస్తుత భారతదేశ గౌరవంతో పోలుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

గతంలో అసలేం జరిగింది?

సుధా మూర్తి గారు 1979లో మొదటిసారి అమెరికా వెళ్లినప్పటి సంఘటనను వివరించారు. ఆ సమయంలో ఆమె వయస్సు కేవలం 28 ఏళ్లు. బోస్టన్ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను ఒక సాధారణ ప్రయాణికురాలిగా కాకుండా ఏదో తప్పు చేసిన వ్యక్తిలా చూశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "నీ దగ్గర ఎన్ని డాలర్లు ఉన్నాయి? రిటర్న్ టికెట్ ఉందా? మీ దేశంలో రోడ్లపై పాములు తిరుగుతాయా? మీ నాన్నగారు ఏమైనా మహారాజా నా?" వంటి హేళన చేసే ప్రశ్నలు వేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమె ఇంగ్లీష్ మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతూ ఆమె సామానును అత్యంత కఠినంగా, అనుమానంతో తనిఖీ చేశారు. "నన్ను ఏదో వేరే గ్రహం నుండి వచ్చిన వ్యక్తిలా చూశారు" అని ఆమె ఆనాటి బాధను పంచుకున్నారు.

40 ఏళ్ల తర్వాత మారిన చిత్రం

అదే బోస్టన్ ఎయిర్‌పోర్టులో ఇటీవల ఆమెకు ఎదురైన అనుభవం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఆమె చీర కట్టుకుని వెళ్లినప్పటికీ ఈసారి అధికారులు ఆమెను ఎంతో మర్యాదగా ఆహ్వానించారు. "వెల్‌కమ్ టు అమెరికా.. మాది చాలా గొప్ప దేశం.. ఇక్కడ పర్యటనను ఆస్వాదించండి" అంటూ అధికారులు సాదరంగా పంపించారట. భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా ఎదుగుతున్న తీరు వల్లే ప్రపంచ దేశాల్లో భారతీయులకు గౌరవం పెరిగిందని ఆమె ఈ సందర్భంగా విశ్లేషించారు.

చర్చకు దారితీసిన అంశాలు: భద్రత vs గౌరవం

సుధా మూర్తి గారి ఈ ప్రసంగంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అప్పట్లో భారతీయులను తక్కువ చేసి చూడటం వల్లనే ఆమెకు ఆ పరిస్థితి ఎదురైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భద్రతా తనిఖీలు ఎంత ముఖ్యమైనా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం ప్రాథమిక బాధ్యత అని సుధా మూర్తి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విదేశీ గడ్డపై ఒక వ్యక్తి గౌరవం అనేది వారి దేశం యొక్క బలాన్ని బట్టి ఉంటుందని ఆమె సందేశం ఇచ్చారు.

"మనం ఎక్కడ ఉన్నా, మన గుర్తింపు ఎంత ఉన్నా.. మన దేశం గొప్పదైనప్పుడే మనకు అంతర్జాతీయంగా గౌరవం దక్కుతుంది" అని సుధా మూర్తి గారు తన అనుభవం ద్వారా చాటి చెప్పారు. ఈ ఘటన కేవలం ఆమె వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు, మారుతున్న భారత ప్రతిష్ఠకు ఒక నిదర్శనం.


Full View


Tags:    

Similar News