ఏఐ భయం వద్దు.. అది ఉత్పాదకతను పెంచే ‘వరప్రదాయిని’!
సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రస్తుతం హాట్ టాపిక్ 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ). ఏఐ పుణ్యమా అని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఊడిపోతాయన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.;
సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రస్తుతం హాట్ టాపిక్ 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ). ఏఐ పుణ్యమా అని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఊడిపోతాయన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓ కె. కృతివాసన్ చేసిన వ్యాఖ్యలు అటు నిపుణుల్లోనూ ఇటు నిరుద్యోగుల్లోనూ కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో ఏఐ వల్లే ఇదంతా జరుగుతోందని చాలామంది నమ్ముతున్నారు. అయితే టీసీఎస్ సీఈఓ కృతివాసన్ ఈ వాదనను తోసిపుచ్చారు. ఏఐ అనేది ఉద్యోగాలను హరించే "భూతం" కాదు.. అది మన పని సామర్థ్యాన్ని పెంచే ఒక "సాధనం" అని ఆయన స్పష్టం చేశారు.
ఏఐ వాడకం వల్ల డెవలపర్లు తమ కోడింగ్.. ఇతర పనులను గతంలో కంటే 20 నుండి 30 శాతం వేగంగా పూర్తి చేయగలరు. దీనివల్ల ప్రాజెక్టులు త్వరగా పూర్తయి కంపెనీలకు కొత్త క్లయింట్లు వచ్చే అవకాశం ఉంటుంది. పాత పద్ధతుల్లో చేసే ఉద్యోగాల స్వరూపం మారవచ్చు కానీ, కొత్తగా డ్రగ్ డిస్కవరీ (ఔషధ రంగం), ఆటోమేషన్, డేటా అనలిటిక్స్ .. ఏఐ అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటి విభాగాల్లో భారీగా నియామకాలు జరుగుతాయని ఆయన అంచనా వేశారు. ఐటీ కంపెనీలు ఇప్పుడు కేవలం గంటల లెక్కన కాకుండా ప్రాజెక్ట్ ఇచ్చే ఫలితాల ఆధారంగా చార్జ్ చేసే దిశగా మారుతున్నాయి. ఇది కంపెనీల ఆదాయాన్ని స్థిరత్వాన్ని పెంచుతుంది.
డేటా సెంటర్ల వెల్లువ: భారత్‌కు భారీ అవకాశం
ఏఐ రన్ అవ్వాలంటే భారీ డేటా సెంటర్లు కావాలి. రాబోయే మూడేళ్లలో భారతదేశంలో దాదాపు 10 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల అవసరం ఉంటుందని అంచనా... డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్.. సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో లక్షలాది కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి.
ఐటీ ఉద్యోగులు ఏం చేయాలి?
కేవలం భయపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవడమే అసలైన పరిష్కారం. బేసిక్ కోడింగ్, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, మాన్యువల్ టెస్టింగ్ ఏఐ-ఆధారిత ఆటోమేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి.
మార్పును స్వీకరించడమే విజయ రహస్యం
టీసీఎస్ సీఈఓ మాటలను బట్టి చూస్తే ఏఐ వల్ల ఐటీ రంగం అంతం కాదు.. సరికొత్తగా పుంజుకోబోతోంది. టైప్రైటర్లు పోయి కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి.. కానీ ఆ తర్వాతే ఉద్యోగ విప్లవం వచ్చింది. ఏఐ విషయంలోనూ అదే జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. సరైన అప్-స్కిల్లింగ్ ద్వారా టెక్ ప్రపంచంలో మన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.