48గంటల తర్వాత చైనా సైనికుడిని తిరిగి అప్పగించిన భారత్ .. విచారణ లో ఏం తేలిందంటే ?

Update: 2020-10-21 06:00 GMT
అనుకోకుండా భారత భూభాగంలోకి  చొరబడ్డ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుడి అప్పగింత పనులు పూర్తి అయ్యయి.  అనుకోకుండా, తెలియకుండా అటు ఆర్మీ జవాన్లు గానీ ఇటు సాధారణ పౌరులు గానీ సరిహద్దులు దాటితే దాయాది పాకిస్తాన్ వ్యవహరించినట్లుగా చైనా సైనికుడితో మన సైన్యం వ్యవహరించలేదు. సకల సౌకర్యాలు కల్పించి , ఎటువంటి లోటు లేకుండా చూసుకొని ,అన్ని అవసరాలు తీర్చి తిరిగి క్షేమంగా చైనాకు అప్పగించింది. మంగళవారం రాత్రి వాస్తవాధీన రేఖ సమీపంలోని ఛుసుల్-మోల్డో బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద అతణ్ని పీఎల్ ఏ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

చైనాకు చెందిన ఓ సైనికుడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్  దాటి మన భారత భూభాగంలోకి ప్రవేశించాడు. ఆ సైనికుణ్ని ‘కార్పొరల్ వాంగ్ యా లాంగ్’ గా గుర్తించారు.  తూర్పు లద్దాఖ్ లోని డెమ్‌ చోక్ సెక్టార్ ‌లో భారత సైన్యం ఆ సైనికుడ్ని పట్టుకుంది. అతని వద్ద సివిల్, మిలటరీకి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల పాటు విచారించారు. అనంతరం విడిచి పెట్టారు. మంగళవారం రాత్రి ఛుసుల్-మోల్డో బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద వాంగ్‌ను చైనా ఆర్మీ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. అతని వద్ద ఎలాంటి సమాచారాన్ని అధికారులు సేకరించారనేది తెలియరావాల్సి ఉంది.

ఆ చైనా సైనికుడు లద్దాఖ్ ప్రాంతంలోని వాతావరణానికి ఆయన తట్టుకునేలా, అతని ఆరోగ్యం దెబ్బతినకుండా భారత సైన్యం అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. ఆక్సిజన్ అందించడం, వైద్య సదుపాయం, ఆహారం, వెచ్చని దుప్పట్లు అందించడం.  ఆ సైనికుడికి ఎక్కడా ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ విషయాన్ని భారత ఆర్మీయే వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆ సైనికుడు భారత భూభాగంలోకి ఎందుకు వచ్చాడన్న దానిపై డ్రాగన్ వివరణ ఇచ్చింది. చైనా సరిహద్దు ప్రాంతంలో  పశువుల కాపరికి చెందిన ఓ జంతువు తప్పి పోయిందని, ఈ క్రమంలో ఆ పశువుల కాపరికి సహాయం చేస్తూ ,చేస్తూ పొరపాటున చైనా సైనికుడు భారత భూభాగంలోకి ప్రవేశించాడని చైనా అధికారులు భారత సైన్యానికి వివరణ ఇచ్చారు.  అయితే , ఆ సైనికుడు పట్టుబడ్డ చుమర్-డెమ్ ‌చొక్ వద్ద రెండు దేశాల వైపునా 50 వేల మంది సైనికులు పహారా కాస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎలా భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చాడనే విషయంపై ఆరా తీస్తున్నామని మన ఆర్మీ అధికారులు చెప్పారు.
Tags:    

Similar News