తెలంగాణ వర్సెస్ ఏపీ : ఇంటర్ రిజల్ట్స్‌లో సత్తా చాటిన రాష్ట్రం ఏది?

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాల సందడి ముగిసింది.;

Update: 2026-04-15 07:36 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాల సందడి ముగిసింది. తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ నెల 12న ఫలితాలు విడుదల చేయగా, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ రోజు ఫలితాలను వెల్లడించింది. ఉదయం 10.31 నిమిషాలకు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఫలితాలను విడుదల చేశారు. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనట్లు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈ సారి రికార్డు స్థాయి ఫలితాలను సాధించారు. మొత్తం 77 శాతం మంది పాసయ్యారు. అదేవిధంగా రెండో ఏడాది విద్యార్థులు 81 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంటర్ ఫలితాల్లో దాదాపు పది శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. తెలంగాణ కంటే మెరుగ్గా ఏపీలో 10 శాతం అధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది.

ఈ నెల 12న విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 66.20 శాతం, ద్వితీయ సంవత్సరంలో 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే రెండు రాష్ట్రాల మధ్య ఎలా చూసుకున్నా దాదాపు 10 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక రెండు రాష్ట్రాల్లోనూ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమే ఈ ఏడాది రిపీటైంది. బాలుర కంటే బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించి 'బెస్ట్' అనిపించుకున్నారు. ఏపీలో సెకండియిర్‌లో బాలికలు 86 శాతం, బాలురు 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో సెకండియిర్‌లో బాలికలు 78.65 శాతం, బాలురు 62.50 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కాగా, గత ఏడాదితో పోలిస్తే రెండు రాష్ట్రాల్లోనూ ఫలితాలు మెరుగయ్యాయి. 2025లో ఏపీలో సెకండ్ ఇయర్ పరీక్ష రాసిన విద్యార్థులు 78 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సారి అది 81 శాతానికి చేరింది. అంటే దాదాపు 3 శాతం వృద్ధి నమోదైంది. ఇక తెలంగాణ వరకు చూస్తే 2025లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత 65.65 శాతం ఉండగా, ఈ ఏడాది 70.58 శాతానికి పెరిగింది. అంటే ఈ రాష్ట్రంలోనూ సుమారు 5 శాతం వృద్ధి కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రైవేటుకు దీటుగా ఉత్తీర్ణత సాధించాయి. ఏపీలో ప్రభుత్వ కళాశాలలు దశాబ్ద కాలంలోనే అత్యుత్తమంగా 69 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. తెలంగాణలో పలు గురుకుల కళాశాలలు 90 శాతానికి పైగా ఫలితాలతో రికార్డు సృష్టించాయి. ఇక రెండు రాష్ట్రాల్లోనూ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వచ్చే నెలలోనే సంప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నాయి. ఏపీలో మే 12 నుంచి మే 20 వరకు, తెలంగాణలో మే 13 నుంచి మే 21 వరకు సప్లిమెంట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News