బ్రిటన్‌లో తెలుగు మహిళకు చేదు అనుభవం.. ఇంగ్లీష్ రాక ఊద్యోగం ఊస్ట్

బ్రిటన్‌లో కొలువు సాధించిన భారతీయ మహిళకు ఎదురుదెబ్బ తగిలిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.;

Update: 2026-04-15 08:30 GMT

బ్రిటన్‌లో కొలువు సాధించిన భారతీయ మహిళకు ఎదురుదెబ్బ తగిలిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇంగ్లీష్ భాషా నైపుణ్యాల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో ఓ తెలుగు మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో కమ్యూనికేషన్ ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

నియామకం నుంచి తొలగింపు వరకు..

తెలుగు మహిళ అక్టోబర్ 2023లో యూకేలోని 'యార్క్ అండ్ స్కార్‌బరో టీచింగ్ హాస్పిటల్స్ ఎన్.హెచ్.ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్' లో బ్యాండ్-5 పీడియాట్రిక్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్గా బాధ్యతలు చేపట్టారు. స్పీచ్ థెరపిస్ట్ అంటేనే మాటలు సరిగా రాని పిల్లలకు శిక్షణ ఇచ్చే బాధ్యత. అయితే విధుల్లో చేరిన ఎనిమిది నెలలకే జూన్ 2024లో ఆమెను ట్రస్ట్ విధుల నుంచి తొలగించింది.

బయటపడ్డ భాషా సమస్యలు

ఆమె విధుల్లో చేరిన కొద్ది రోజులకే సహోద్యోగులు ఆమె భాషా నైపుణ్యాలపై సందేహాలు వ్యక్తం చేశారు. స్పీచ్ థెరపిస్ట్‌గా చిన్నారులు, వారి తల్లిదండ్రులతో నిరంతరం సంభాషించాల్సి ఉంటుంది. కానీ ఈ తెలుగు సమస్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు మేనేజర్లు గుర్తించారు. రోగులు, సహచరులు మాట్లాడే ఇంగ్లీష్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం.. పదాలను స్పష్టంగా ఉచ్చరించడంలో విఫలం కావడం... సరైన వ్యాకరణంతో కూడిన వాక్యాలను నిర్మించలేకపోవడం గుర్తించారు.

తప్పుడు సమాచారంతో ముప్పు

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ తెలుగు మహిళ "ఇంగ్లీష్ తన మొదటి భాష" అని పేర్కొన్నారు. బ్రిటన్ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి మొదటి భాష ఇంగ్లీష్ అయితే వారు ప్రత్యేకంగా ఐఈఎల్.టీఎస్ లేదా ఓఈటీ (ఓఈటీ) వంటి భాషా ప్రావీణ్య పరీక్షల పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని ఆమె ఉద్యోగం పొందారు.

అయితే నవంబర్ 2023లో జరిగిన సమీక్షలో ఆమె అసలు విషయం ఒప్పుకున్నారు. తన మాతృభాష తెలుగు అని.. పని ముగిసిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవడానికి క్లాసులకు వెళ్తున్నానని అంగీకరించారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు వేగంగా మాట్లాడినప్పుడు తనకు అర్థం కావడం లేదని ఆమె పేర్కొనడం గమనార్హం. ఇంటర్వ్యూ సమయంలో కూడా ఆమె ప్రశ్నలకు సమాధానాలను 'చాట్ బాక్స్' ద్వారా టైప్ చేస్తానని కోరడం అప్పట్లోనే అనుమానాలకు దారితీసింది.

ట్రైబ్యునల్ తీర్పు.. హెచ్చరిక

ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తెలుగు మహిళ 'హెల్త్ అండ్ కేర్ ప్రొఫెషన్స్ ట్రిబ్యునల్ సర్వీస్'వద్ద సవాలు చేశారు. తన విద్యాభ్యాసం అంతా ఇంగ్లీష్ మీడియంలోనే సాగిందని.. అందుకే అది తన మొదటి భాష అని భావించానని ఆమె వాదించారు. కానీ విచారణలో ఆమె ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా ఐఈఎల్.టీఎస్ పరీక్ష రాయలేదని తేలింది.ట్రైబ్యునల్ ఆమె వాదనలను తోసిపుచ్చుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. "ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నంత మాత్రాన అది మాతృభాష లేదా మొదటి భాష అయిపోదు. దరఖాస్తు ఫారమ్‌లోని నిబంధనలను ఆమె కావాలనే తప్పుగా అర్థం చేసుకుని, సంస్థను తప్పుదారి పట్టించారని పేర్కొంది.

అభ్యర్థులకు గుణపాఠం

విదేశాల్లో ముఖ్యంగా వైద్య, చికిత్సా రంగాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి ఈ ఘటన ఒక హెచ్చరిక. మాతృభాషపై మమకారం ఉన్నప్పటికీ వృత్తిపరంగా అంతర్జాతీయ వేదికలపై రాణించాలంటే ఆ దేశ భాషా ప్రమాణాలను అందుకోవడం అనివార్యం. కేవలం విద్యా అర్హతలు ఉంటే సరిపోదని.. బాధ్యతాయుతమైన పదవుల్లో కమ్యూనికేషన్ లోపం రోగుల భద్రతను ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News