రైతుల ఆందోళన మీద 7 గంటల చర్చ తర్వాత ఏమీ తేల్లేదు

Update: 2020-12-04 05:27 GMT
మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఊహించని రీతిలో ఎదురైన సవాళ్లు ఉన్నప్పటికి.. అవేమీ కూడా తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన ముందు పెద్దవి కావంటున్నారు. లక్షలాది మంది రైతులు మూడు.. నాలుగు రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు.. ప్రైవేటు వాహనాల్ని కట్టుకొని దేశ రాజధాని ఢిల్లీ వైపు వస్తున్న పరిస్థితిని ఎలా నిలువరించాలో అర్థం కాక కిందామీదా పడిపోతున్నారు. అన్నింటికి మించి.. వణికించే చలిలో దీర్ఘకాలం పోరాటానికి సన్నద్దులై.. ఆహార పదార్థాలతో వస్తున్న వారి ప్లానింగ్ మోడీ సర్కారుకు ముచ్చమటలు పోసేలా చేస్తోంది.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాన్ని.. అందులోని అంశాల్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని వారు కోరుతుంటే.. అందుకు మాత్రం ససేమిరా అంటోంది కేంద్రం. ఆందోళన చేస్తున్న అన్నదాతలకు అర్థమయ్యేలా చెప్పి.. వారి ఆందోళనను విరమించేలా చేస్తానని మొదట్లో బీరాలు పలికిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. తాము అంచనా వేసిన దానికంటే పెద్దదిగా రైతు ఆందోళన ఉందన్న విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది.

మరింత కాలయాపన చేస్తే.. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన కమలనాథులు.. ఇప్పుడు చర్చలకు పిలుస్తున్నారు. అలా అని.. ఆందోళన చేస్తున్న వారు లేవనెత్తే సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారా? అంటే అదీ లేదని చెప్పాలి. ఇలాంటి వాతావరణంలో దాదాపుఏడు గంటల పాటు సాగిన చర్చల పరంపర.. ఎలాంటి పరిష్కారాల్ని తీసుకోకుండానే చర్చల్నినిలిపేయాల్సి వచ్చింది. తదుపరి చర్చల్లో సమస్యల పరిష్కారం గురించి మరోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.

అంతకంతకూ పెరుగుతున్న అన్నదాతల ఆందోళన నేపథ్యంలో.. మొదట్లో కంటే కేంద్రం కాస్త దిగివచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. మొదట్లో చట్టంలో మార్పులకు ససేమిరా అన్న బీజేపీ సర్కారు.. ఇప్పుడు ఆ విషయంలో కాస్త తగ్గి.. కొన్ని సవరణలకు సిద్ధమవుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ - కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు భేటీ అయ్యారు. మరోవైపు వివిధ రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలతో ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. వాణిజ్య.. రైల్వే శాఖా మంత్రిపీయూష్ గోయెల్.. వాణిక్య మంత్రి కమ్ పంజాబ్ ఎంపీ సోమ్ ప్రకాశ్ చర్చల్లో పాల్గొన్నారు.

వీరి భేటీ దాదాపు ఏడు గంటలకు పైనే సాగింది. అయినప్పటికీ.. ఎలాంటి పరిష్కారం లభించకపోవటం గమనార్హం. కనీస మద్దతు ధరల వ్యవస్థ కొనసాగుతుందని తోమర్ స్పష్టంచేశారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించటానికి ఒక చట్టం చేయాలనిరైతులు కోరినట్లుగా తెలుస్తోంది. అంటేకాదు.. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే వారికి కఠిన శిక్షలు విధిచాలన్న చట్టాన్ని తీసుకురావాలని రైతు సంఘాలు కోరతున్నాయి. లేదంటే.. ఇదే అంశం చట్టంలో ఉండాలని కోరుతున్నారు. అయితే.. ఈ అంశానికి ప్రభుత్వం హామీ ఇవ్వకపోవటం గమనార్హం. గంటల కొద్దీ సమయాన్ని చర్చల కోసం వెచ్చించినా.. ఈ అంశం అంత తేలిగ్గా తెగుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News