కేరళలో ఆరుగురు పిల్లలు ఆకలితో మట్టి తింటున్నారట

Update: 2019-12-04 06:00 GMT
దేవతలు నడియాడే ప్రదేశంగా గొప్పగా చెప్పే సంపన్న రాష్ట్రమైన కేరళలో అమానవీయమైన ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. పేదరికంతో పుట్టెడు పిల్లలు ఉన్న ఒక తల్లి.. వారికి కడుపు నిండా బువ్వ పెట్టలేని దైన్యం బయటకు వచ్చింది. దీంతో పిల్లలు తమ ఆకలి తీర్చుకునేందుకు మట్టిని.. బురదను తింటున్న వైనం వెలుగు చూసి సంచలనంగా మారటమే కాదు కేరళ పాలకుల్ని తిట్టి పోస్తున్నారు.

తాగుడుకు బానిసైన ఇంటి యజమాని ఒకవైపు.. ఆరుగురు పిల్లలు మరోవైపు ఉన్న నేపథ్యంలో వారికి ఆహారాన్ని ఎలా ఇవ్వాలో అర్థం కాని దీన పరిస్థితుల్లో ఆ తల్లి ఉంది. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని ఒక రైల్వే ట్రాక్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం వెలుగుచూసి హాట్ టాపిక్ గా మారింది.

దీంతో ప్రభుత్వం స్పందించింది.ఇద్దరు చిన్నారులు (నెలన్నర వయసున్న) మినహా మిగిలిన నలుగురు పిల్లల్ని శిశు సంరక్షణ సమితి సంరక్షణ బాధ్యతల్ని తీసుకోగా.. ఆ తల్లికి తాత్కాలిక ఉద్యోగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉదంతం వెలుగు చూసిన వెంటనే తిరువనంతపురం మేయర్ స్పందించగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అధికారపక్షాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా లైఫ్ మిషన్ పథకం కింద నిర్మిస్తున్న అపార్ట్ మెంట్లో ఒక ఫ్లాట్ ను సైతం కేటాయించారు. సంపన్న రాష్ట్రంలో ఇంత దారుణమా? అని పలువురు మండిపడుతున్నారు. కేరళకు ఈ ఉదంతం ఒక అవమానంగా అభివర్ణిస్తున్న వారు లేకపోలేదు.
Tags:    

Similar News