కరోనాతో మరో బ్రతుకు ఛిద్రం..ఐమాక్స్ థియేటర్ ఆపరేటర్ ఆత్మహత్య

Update: 2020-09-12 09:50 GMT
కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అనేక రంగాలు సంక్షోభంలో పడిపోయాయి. ఎంతో మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకొని జీవనోపాధి కోల్పోయారు. కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఉపాధి దొరుకుతుందన్న నమ్మకం లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాగే హైదరాబాద్ లో ఓ ఐమాక్స్ సినిమా థియేటర్లో ఆపరేటర్ గా పని చేస్తున్న వ్యక్తి   కరోనా  కారణంగా జీతం ఇవ్వడం కుదరదని  యాజమాన్య చెప్పడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖైరతాబాద్ చెందిన భాస్కర్(52)   ఐమాక్స్ సినిమా థియేటర్ లో ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. కరోనా కారణంగా సినిమా థియేటర్లను  ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఎప్పుడు తెరుస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు సినిమాల విడుదల ఆగి పోవడంతో తీవ్రంగా నష్టపోయాయి.  తమ సిబ్బందికి సగం మేరకు మాత్రమే జీతం ఇస్తూ వస్తున్నాయి.

 ఐమాక్స్ థియేటర్ యాజమాన్యం కూడా ఇప్పటివరకు తమ వద్ద పని చేసే సిబ్బందికి సగం సగం జీతం ఇస్తూ వచ్చింది. సినిమాల విడుదలకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో వచ్చేనెల నుంచి ఆ సగం జీవితం కూడా నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ఉద్యోగులకు తెలియజేసింది. జీతం రాక పోతే కుటుంబాన్ని నడపడం ఎలా అని మనస్తాపం చెందిన భాస్కర్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా  స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News