పీవీ బతికి ఉంటే కూతురు మాటలకు ఆత్మహత్య చేసుకునేవారట

Update: 2021-02-28 14:30 GMT
హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని ఎంపిక చేయటం తెలిసిందే. ఇప్పటికే ఈ ఎంపిక మీద పెద్ద ఎత్తున విమర్శలు.. వ్యంగ్యాస్త్రాల్ని సంధిస్తున్నారు. తాజాగా సీపీఐ సీనియర్ నేత.. కామ్రేడ్ నారాయణ తాజాగా ఈ అంశంపై స్పందించారు.

మామూలుగానే కరకుగా మాట్లాడే నారాయణ.. పీవీ కుమార్తెను టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేయటం.. ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై నారాయణ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పీవీ బతికి ఉంటే.. కుమార్తె మాటలకు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. పీవీకి.. కేసీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న ఆయన.. కేసీఆర్ ను తన తండ్రి పీవీతో పోల్చటం హాస్యాస్పదమన్నారు.

పీవీ చనిపోయి బతికిపోయాడని.. లేదంటే తన కుమార్తె మాటలకు ఏ లోకంలో ఉన్నా పీవీ బాధపడటం ఖాయమని ఫైర్ అయ్యారు. పీవీ శత జయంతి ఉత్సవాల్ని జరపకుండా మోసం చేసిన కేసీఆర్.. పీవీ కుమార్తె రూపంలో అద్దె అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ అరువు తెచ్చుకుందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయరు కాబట్టి.. పీవీ పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు. తెలంగాణలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్.. విజయసారథి ఇద్దరు గెలవటం ఖాయమన్నారు. మరి.. నారాయణ జోస్యం ఏమేరకు నిజమవుతుందో చూడాలి.
Tags:    

Similar News