మధ్యంతర ఎన్నికలొస్తే ఆయన పోటీచేస్తారట

Update: 2019-04-19 14:29 GMT
సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ ఎలా ఉంటుందో తెలుసు కదా.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా ఉంటుంది ఆయన ఎంట్రీ ప్రతి సినిమాలో కూడా. కానీ, రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం రజినీ ఎంట్రీ చాలా నీరసంగా ఉంటోంది. అదిగోఇదిగో అంటూ పార్టీ ప్రకటించినా... ఎన్నికల్లో పోటీకి మాత్రం ఆయన వెనకడుగు వేసేశారు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నా ఆయన తన పార్టీని గట్టు మీదే నిలబెట్టి సైలెంటుగా ఉన్నారు. అయితే... తాజాగా మాత్రం రజినీ అభిమానుల చెవులకు వీనుల విందైన మాట చెప్పారు. తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.
   
శుక్రవారం రజినీ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. చెన్నైలోని తన నివాసం ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారా? అని ప్రశ్నించగా మే 23న తెలుస్తుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికలతో పాటు తమిళనాడులోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18నే ఉప ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో డీఎంకే మంచి ఊపు మీద ఉండడంతో ఈ ఉప ఎన్నికల్లో డీఎంకేకు మెజారిటీ స్థానాలు వస్తే అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోయే అవకాశముంది.
   
ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా  మే 23నే తెలుస్తాయి. ఒకవేళ ఉప ఎన్నికల ఫలితాలు అధికార అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వస్తే అక్కడ మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి రావొచ్చు. ఈ కోణంలోనే విలేకరులు మధ్యంతర ఎణ్నికలు వస్తే పోటీ చేస్తారా అని రజినీని అడిగారు. దానికి ఆయన ‘సిద్ధమే’ అని చెప్పారు.
   
కాగా ఎన్నికలు రెడీ అని రజినీ అనడంతో ఆయన అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. అంతేకాదు.. రజినీ ప్రకటనతో రాజకీయ పార్టీల్లోనూ కదలిక మొదలైంది. రజినీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న కోణంలో అప్పుడే కొత్త సమీకరణలకు తెర తీస్తున్నారు.
   
అయితే.. ఇదంతా మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడే. కానీ, డీఎంకే మెజార్టీ సాధించి గవర్నరు కనుక వారికి బలం నిరూపించుకునే అవకాశం ఇస్తే మధ్యంతర ఎన్నికల చాన్సూ ఉండదు.. రజినీ పోటీ చేసేందుకు ఇప్పుడే అవకాశమూ రాదు.
Tags:    

Similar News