పోలీసులు రాకుంటే మరో పది నిముషాల్లో చంపేసేవారు ; డాక్టర్‌ హుస్సేన్

Update: 2020-10-29 12:10 GMT
హైదరాబాద్‌ లో సంచలనంరేపిన డాక్టర్ కిడ్నాప్ ‌కు అనంతపురం జిల్లా పోలీసులు పుల్ ‌స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు సినిమా రేంజ్ లో టెక్నాలజీ ఉపయోగించుకొని , నిరంతరం కిడ్నాపర్ల కదలికల్ని గమనిస్తూ , అలాగే పక్క రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఈ కిడ్నాప్ ను ఛేదించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ శివారు లో ఎక్సైజ్‌ అకాడమీ సమీపంలోని ప్రెస్టీజ్‌ విల్లాస్‌లో నివాసముంటున్న దంత వైద్యుడు బెహజత్‌ హుస్సేన్‌ సమీపంలోని మరో బిల్డింగ్‌లో క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. రోజులాగే మంగళవారం మధ్యాహ్నం క్లినిక్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భోజనం కోసం ఇంటికెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే బురఖాలు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు క్లినిక్‌ లోపలికి వచ్చారు. డాక్టర్ వ్యక్తిగత సహాయకుడు సయ్యద్‌ సల్మాన్‌ ను తీవ్రంగా కొట్టి నోటికి ప్లాస్టర్‌ వేశారు.. కాళ్లు, చేతులు కట్టేశారు.

దుండగులు డాక్టర్‌ను కొట్టి.. క్లినిక్‌ బయటకు లాక్కొచ్చారు. తర్వాత కారు లో ఎక్కించుకుని శంకర్‌పల్లి రోడ్డు వైపు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వ్యక్తిగత సహాయకుడు సయ్యద్ తాళ్లు, ప్లాస్టర్ తీసుకుని తన తండ్రికి ఫోన్‌ చేసి కిడ్నాప్ గురించి చెప్పాడు. వెంటనే డాక్టర్ హుస్సేన్‌ భార్యకు విషయం తెలియడంతో.. 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  డాక్టర్‌ కుటుంబానికి ఫోన్‌ చేసి... 10 కోట్లు డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడు ముస్తఫా... హుస్సేన్‌ భార్యకు బంధువు. ఆస్ట్రేలియా లో వ్యాపారం చేసి నష్టపోయిన ముస్తఫా... అక్రమం గా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఖలీద్ అనే వ్యక్తితో కలిసి కిడ్నాప్ స్కెచ్ వేశాడు.

ఈ కిడ్నాప్ గురించి తెలియగానే అలర్ట్ అయిన సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌ కేసును ఛేదించడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. కిడ్నాపర్ల కదలికలపై అనంతపురం పోలీసులకు సమాచారం అందించారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆ జిల్లా పోలీసులు, నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. మొదట తపోవనం వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కిడ్నాపర్లు కారును ఆపకుండా వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిడ్నాపర్ల కారును వెంబడించారు. చివరకు రాప్తాడు మండలం బుక్కచర్ల దగ్గర ఛేజ్‌ చేసికిడ్నాపర్లను పట్టుకున్నారు. కిడ్నాపర్ల చెర నుంచి డాక్టర్‌ హుస్సేన్‌ను విడిపించారు.

మరో పదినిమిషాలు గడిస్తే తనను చంపేసేవారని డాక్టర్‌ హుస్సేన్‌ తెలిపారు. పోలీసులు తనను కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కేసును ఛేదించడంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ పోలీసులు కీలకంగా వ్యవహరించారు. డాక్టర్‌ కిడ్నాపైన వెంటనే నిందితులు రాష్ట్రం దాటే అవకాశం ఉందనే అంచనాతో  పొరుగు రాష్ట్రాల పోలీసుల్ని అప్రమత్తం చేశారు. . కిడ్నాపర్ల వాహనాల కదలికల ఆధారంగా ఆయా ప్రాంతాల పోలీసులతో మాట్లాడారు. సమాచారం అనంతపురం పోలీసులకు చేరవేయడంతో పట్టుకోవడంతో నిందితుల్ని రాప్తాడులో పట్టుకున్నారు.ఈ కిడ్నాప్ గురించి తెలిసిన తర్వాత పక్క రాష్ట్రాల అధికారులతో మాట్లాడుతూ ఫాలో అప్‌ చేసిన సీపీ సజ్జనార్‌, డాక్టర్ ను కాపాడినట్టు వార్త తెలిసిన తర్వాతే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది.
Tags:    

Similar News