చరిత్ర చెప్పే నిజం.. ఆంధ్రాతో పెట్టుకున్నోళ్లు అస్సలు బాగుపడలేదు

Update: 2021-02-07 08:15 GMT
తప్పు మీద తప్పు జరుగుతోంది. అది ఆంధ్రప్రదేశ్ విషయంలోనే తరచూ జరుగుతోంది. కేంద్రంలోని సర్కారు.. టార్గెట్ చేసినట్లుగా ఒక రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తోంది. నవరత్న కంపెనీల్లో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పాలని.. దాన్ని అమ్మేయాలన్న కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే విశాఖలోని ప్రజలు వీధుల్లోకి వచ్చి.. తమ సంస్థను కాపాడుకోవటానికి నడుం బిగించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడింది లేదన్న విషయాన్ని మోడీ సర్కారు గుర్తిస్తే మంచిందంటున్నారు. సౌత్ తో బలపడాలన్న కాంక్షను ప్రదర్శించే బీజేపీ.. తమ పార్టీ పేరు వినిపిస్తే చాలు.. ఛీ కొట్టే పరిస్థితిని ఎందుకు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలన్న నిర్ణయం ఒక్క ఏపీ మీదనే కాదు.. దక్షిణాది రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మోడీ సర్కారు విస్మరిస్తోంది.

ఇప్పటికే ఉత్తరాది వర్సెస్ దక్షిణాది అన్న భావన పెరిగిపోవటమే కాదు.. ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిపై కేంద్రంలోని ప్రభుత్వాలు శీతకన్ను వేస్తున్నాయన్న భావన ప్రజల్లో అంతకంతకూ పెరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి అంశాల్లో ఇది మరింత పెరగటమే కాదు.. కేంద్రంతో దక్షిణాది రాష్ట్రాలు.. అక్కడి ప్రజలు దూరమవుతారన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. ఏపీతో పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఏపీని రెండు ముక్కలు చేయటం ద్వారా.. రాజకీయంగా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించొచ్చన్న చావుతెలివిని ప్రదర్శించిన కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మటం ద్వారా కేంద్రానికి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువన్నది మోడీ సర్కారు గుర్తిస్తే మంచిది. తొందరపడి నిర్ణయం తీసుకొని.. ఆవేశంగా అమలుపై ఫోకస్ చేస్తే.. తర్వాత ఎంత బాధ పడినా ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. ఆంధ్రాతో పెట్టుకున్న వారు.. దాన్ని దెబ్బ తీయాలని భావించినోళ్లు  ఎవరూ బాగుపడలేదన్నది చరిత్ర చెబుతోందని.. ఆ విషయాన్ని మోడీ సర్కారు గుర్తించాలన్న మాట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మరి.. కేంద్రంలోని మోడీ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News