అక్రమ నిర్మాణాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఎల్ఆర్ఎస్ తీసుకురావటమా?

Update: 2020-11-06 05:45 GMT
అక్రమాల్ని చట్టబద్ధంగా సక్రమం చేసుకోవటాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ నిర్మాణాలు.. అక్రమ లేఔట్లనున క్రమబద్ధీకరించుకోవటానికి ఎల్ ఆర్ఎస్.. బీఆర్ఎస్ లాంటివి ప్రభుత్వం ఎలా తీసుకొస్తుందన్న ప్రశ్నను సంధిస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నరెన్స్ సంస్థతో పాటు పలువురు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అక్రమ నిర్మాణాల్ని ఇదే రీతిలో కొనసాగిస్తూ పోతే.. 2050 నాటికి పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళనను వ్యక్తం చేసింది. గతంలో చెరువుల్లోనిర్మాణాలు చేపట్టాలంటే భయంగా ఉండేదని.. ఇప్పుడు లేక్ వ్యూ అంటూ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

చెరువులు.. నాలాల్లో నిర్మాణాల కారణంగానే వరదలు వస్తున్నాయని.. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా.. అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవటం లేదంది. చట్టవిరుద్దమైన కార్యకలాపాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తే.. ఇలాంటి అక్రమాలకు చోటు ఉండదని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలు లేవని పేర్కొంది.

ఎల్ ఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటూ పదే పదే అవకాశాలు కల్పిస్తూ.. భవిష్యత్తు ఆందోళనకరమవుతుందన్న హైకోర్టు.. ఇలాంటివి భవిష్యత్తులో మానవ మనుగడకే ముప్పుగా మారుతుందని పేర్కొంది. 2015లో ఇలాంటి పథకాలు తీసుకొచ్చారని.. మళ్లీఇప్పుడు అవకాశం ఇస్తున్న వైనాన్ని గుర్తు చేశారు. అక్రమ నిర్మాణాల్ని సక్రమం చేసేందుకు ఉద్దేశించిన జీవో అమలును నిలిపివేయటానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి కోర్టు నో చెప్పింది. అదే సమయంలో జీవోను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపైనా కౌంటర్లు దాఖలు చేయాలని మాత్రం ప్రభుత్వానికి ఆదేశిస్తూ.. కేసు విచారణను వాయిదా వేసింది. ఎల్ఆర్ఎస్ విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ సర్కారుకు తాజా పరిణామం కొంత షాక్ ను ఇస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News